Friday, May 17, 2019

naidu step ups kejriwal yechuri to meet rahul mayawati akilesh before may23


రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో నేతలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం(మే17) ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ 19న జరగనుండగా ఫలితాలు 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. మే23న మిత్రపక్షాలు,  కాంగ్రెస్ తో కలిసి వచ్చే అవకాశం ఉన్న పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. అంతకు వారం ముందుగానే చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో మరోసారి కీలకపాత్ర పోషించడానికి ఉద్యుక్తులయ్యారు. శుక్రవారం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకుని చర్చలు జరిపారు. శనివారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. తర్వాత లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయవతి, సమాజ్ వాది పార్టీ అధినాయకుడు అఖిలేశ్ యాదవ్ లను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ టీఆర్ఎస్ సహా భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే అన్ని పక్షాలను తమ కూటమిలోకి స్వాగతిస్తామన్నారు. ఢిల్లీ చేరగానే తొలుత ఆయన ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలతో పాటుగా 50 శాతం వీవీప్యాట్ ల్ని లెక్కించాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాల తీరు ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో కొనసాగిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. రీపోలింగ్ తదితర చాలా అంశాల్లో స్థానిక అధికారుల తీరు వివాదాస్పదమయిందన్నారు. ముఖ్యంగా ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో 38 రోజుల తర్వాత 5 కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టనుండడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వై.ఎస్.ఆర్.సి.పి. సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోరగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్ణయాన్ని ఇటీవల వెల్లడించింది. తొలివిడత ఏప్రిల్11నే ఇక్కడ ఎన్నిక పూర్తవ్వగా ఎన్నికల మలిదశ మే19న రీపోలింగ్ తలపెట్టడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Two Indian climbers dead, Irishman missing in Nepal's Himalayas

హిమాలయాల్లో ఇద్దరు భారత పర్వతారోహకుల మృతి..ఆచూకీ లేని ఐర్లాండ్ వాసి
హిమాలయ పర్వతారోహక బృందంలోని ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఒక ఐర్లాండ్ జాతీయుడి ఆచూకీ తెలియరావడం లేదు. శుక్రవారం(మే17) అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఈ నెలలో మృతి చెందిన పర్వతారోహకుల సంఖ్య ఆరుకు చేరింది. నేపాల్ మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో ఒకటైన మకాలు పర్వతారోహణకు వెళ్లిన న్యూఢిల్లీకి చెందిన రవి ఠకర్(27), నారాయణ్ సింగ్(34) మృతి చెందగా డబ్లిన్ లో టీచరయిన సీమస్ సీన్ లాలెస్(39) జాడ తెలియడం లేదు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఏజెన్సీకి చెందిన థానేశ్వర్ గుర్గాయిన్ అందించిన వివరాల ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ సౌత్ కోల్(శిఖర లోయ) శిబిరంలోనే ప్రాణాలు కోల్పోయిన రవి ఠకర్ ను కనుగొన్నారు. అయితే అతని మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అననుకూల వాతావరణం కారణంగానే అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మకాలు నుంచి తిరుగు ప్రయాణంలో నారాయణ్ సింగ్ అస్వస్థతకు గురై గురువారం మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి మిరా ఆచార్య తెలిపారు. అతను ఉత్తరాఖండ్ కు చెందిన సైనికుడని తెలుస్తోంది. సాహసయాత్రలో ఉండగా గురువారం సీమస్ కాలు జారి మంచులోయలోకి పడిపోయినట్లు సమాచారం. 

UN health agency highlights lifestyle choices to prevent dementia



చక్కటి జీవనశైలి వ్యాయామంతో మతిమరుపు దూరం: డబ్లూహెచ్ఓ
ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న తాజా ఆరోగ్య సమస్య డెమెన్షియా (చిత్తవైకల్యం- మతిమరుపు). ప్రస్తుతం విశ్వ వ్యాప్తంగా అయిదు కోట్ల మంది (50మిలియన్లు) ఈ వ్యాధి బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల ప్రకటించింది. ఏటా కోటి మంది(10మిలియన్లు) కొత్తగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ఈ సమస్యకు చాలా సులభమైన పరిష్కారాన్ని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ధూమపానం(స్మోకింగ్), మద్యపానం(డ్రింకింగ్) మానేసి చక్కటి జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ డెమెన్షియా దరిచేరదని పేర్కొంది. అంతేగాక పై చిట్కా ద్వారా ఊబకాయం, రక్తపోటు, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండి గుండె, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ  డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధ్నామ్ గాబ్రియెసిస్ సూచించారు. తమ సంస్థ ఇప్పటికే బోస్నియా, హెర్జ్ గొవినా, క్రోయేసియా,ఖతర్, స్లొవేనియా, శ్రీలంక తదితర దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. డెమెన్షియా వ్యాధిని గుర్తించే పరీక్ష శిబిరాలు, చికిత్స తదితరాల పైన డబ్ల్యూహెచ్ఓ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా డెమెన్షియా వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు డబ్యూహెచ్ఓ మానసిక ఆరోగ్య పరిరక్షణ విభాగ డైరెక్టర్ డాక్టర్ డెవొరా కెస్టెల్ పేర్కొన్నారు. ఆన్ లైన్ కార్యక్రమాల ద్వారా ఎవరికి వారు తమ సమస్యను గుర్తించొచ్చని చెప్పారు. కుటుంబ సభ్యులు, విధి నిర్వహణలో సహ సిబ్బందితో వ్యవహారశైలి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా డెమెన్షియా లక్షణాల్ని గుర్తించి తగు చికిత్స ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని తెలిపారు.