Friday, September 4, 2020

rummy the e-gambling ban in AP


ఆన్ లైన్ పేకాటపై ఏపీ కొరడా

రమ్మీ, పోకర్‌ తదితర ఆన్ లైన్  జూదాలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఈ జూదాల్ని ఆడేవారికి, నిర్వహించే వారికీ జైలు శిక్ష సహా జరిమానా విధించాలని జగన్ సర్కారు తీర్మానించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఏపీ గేమింగ్‌ యాక్టు (1974) సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారికి 6నెలలు జైలు శిక్ష విధిస్తారు. నిర్వాహకులకు మొదటిసారి ఏడాది శిక్షతో పాటు జరిమానా పడుతుంది. రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్‌లో జూదాన్ని ప్రోత్సహించి యువతను పెడదోవ పట్టిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలని జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.