Wednesday, April 17, 2019

ipl 2019 srh vs csk match hyderabad win by 6 wickets as dhoni less chennai suffer second loss of the season


వరుస ఓటముల తర్వాత చెన్నైపై గెలిచిన హైదరాబాద్
విజయాల రుచి మరిగిన చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా పోరాడకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తలవంచింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ నం.33 లో టాస్ గెలిచిన యాక్టింగ్ కెప్టెన్ సురేశ్ రైనా మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. నడుం నొప్పి కారణంగా ధోని ఈ మ్యాచ్ ఆడలేదు. నాయకుడు లేని చెన్నై జట్టు పేలవమైన ఆటతీరు కనబర్చింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై అయిదు వికెట్లు కోల్పోయి 6.60 రన్ రేట్ తో 132పరుగులు మాత్రమే చేసింది. డూప్లెసిస్(45), షేన్ వాట్సన్(31), రాయుడు(25) చెప్పుకోదగ్గ పరుగులే చేసినా జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.బౌలర్లకు సహకరించని పిచ్ పై బ్యాటర్లూ రాణించలేకపోవడం విచిత్రం. ఏడు విజయాలతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓటమి మూటగట్టుకుంది. లక్ష్యం చిన్నదే కావడంతో ఒత్తిడే లేకుండా హైదరాబాద్ జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది. నాలుగు వరుస ఓటముల తర్వాత జట్టుకు ఈ గెలుపు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. అర్ధ సెంచరీల హీరో వార్నర్ మరోసారి తన వాటా పరుగులు(25 బంతుల్లో 50) చేయగా మరో ఓపెనర్ జానీ బేస్టో (44 బంతుల్లో61 పరుగులు) అర్ధ సెంచరీతో నాటౌట్ గా మ్యాచ్ గెలిచే వరకు క్రీజ్ లో నిలిచాడు. మూడు ఓవర్ల మిగిలి ఉండగా విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉన్న దశలో ఆడిన తొలిబంతినే యూసఫ్ పఠాన్ విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ లో 16.5 ఓవర్లలో 137/4 పరుగులు చేసి అలవోకగా గెలుపొందింది. 2010 తర్వాత ఐపీఎల్ లో ధోని ఆడని మొదటి మ్యాచ్ ఇదే. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

pant rayudu saini named indias standbys for world cup


స్టాండ్ బై ఆటగాళ్లగా ఎంపికైన రాయుడు, పంత్, సైనీ
వరల్డ్ కప్-2019 టీమ్ ఇండియా స్టాండ్ బై ఆటగాళ్లగా యువ క్రికెటర్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్, నవదీప్ సైనీలను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కక బాధతో రగిలిపోతున్న ఈ యువ ఆటగాళ్లకు బీసీసీఐ ప్రకటన ఒకింత ఉపశమనం కల్గిస్తుంది. అయితే భారత జట్టు ఆటగాళ్లు ఎవరైన గాయపడి అత్యవసరమైతేనే వీరికి ఆడేందుకు పిలుపు వస్తుంది. రాయుడు, పంత్ తొలి స్టాండ్ బైలుగా సైనీ రెండో స్టాండ్ బై జాబితాలో ఉంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రాయుడు ఎంపిక కాకపోవడాన్ని మాజీ స్టార్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించగా, పంత్ కు చోటు దక్కకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నెట్ బౌలర్లగా సేవలందించేందుకు ఖలీల్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ లు జట్టుతో పాటు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్నారు. మే12 వరకూ ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నందున టీమ్ ఇండియాకు యోయో పరీక్షలు ఉండబోవని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

CM reviews Polavaram project no worry about andhra pradesh election results


సీఎం పోలవరం పనుల సమీక్ష
·   ఏపీ ఎన్నికల ఫలితాలపై చింతలేదన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం (ఏప్రిల్17) పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. వేసవి కావడంతో తాగునీటి సరఫరాపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై తనకు చింతే లేదని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫలితాలు రావడానికి మే 23 వరకు చాలా సమయం ఉంది.. ప్రస్తుతం తన దృష్టంతా ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడ్డం..అభివృద్ధి పైనే ఉందని తెలిపారు. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను.. ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తనదేనన్నారు. కొత్త విధానపర నిర్ణయాలు మినహా సాధారణ పరిపాలన సమర్ధంగా కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పేర్కొంటూ సీఎం ఇప్పటికే 69 శాతం పనులు పూర్తి చేశామని గత 45 రోజులుగా పనులు కొంత నెమ్మదించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,508 కోట్లు రీయింబర్స్ మెంట్ మొత్తం అందాల్సి ఉందన్నారు. తాగు నీటి ఎద్దడి నివారించేందుకు ఆయా ప్రాంతాల్లో 3,494 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.184కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు.

a success story of twitter ceo jock dorsey with abnormal daily activities


వావ్ ట్విటర్ సీఈవో
ట్విటర్ సీఈవో జాక్ డోర్సి సాధించిన విజయం యువతకు చక్కటి ఆదర్శం. ఆ సక్సెస్ ఒక్కగంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమతోనే సాధించారు. అంతకు మించి అసాధారణ దినచర్యే తనను ముందుకు నడిపిందంటారాయన. డోర్సి ఉదయం 5కే నిద్ర లేస్తారు. గడ్డకట్టించే చల్లటి నీటితో స్నానం చేస్తారు.. రోజూ ఒకపూటే భోజనం చేస్తారు.. వారాంతంలో అయితే పూర్తిగా ఉపవాసమే.. సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు నడిచే వెళ్తారు.. ఈ విషయాలన్నీ ఆయన ఓ ఫిట్ నెస్ పాడ్ కాస్ట్ షో లో వివరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఇంతకీ 42 ఏళ్ల డోర్సి సంపద ఎంతో తెలుసా? ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 5 బిలియన్ డాలర్లు (రూ.3,450 కోట్లు). ఏటా ట్విటర్ యూజర్ల సంఖ్య 30 కోట్ల మంది కాగా డోర్సికి సంస్థ ద్వారా 2018 చివరి త్రైమాసికానికి సమకూరిన ఆదాయం 909 మిలియన్ డాలర్ల (రూ.630 కోట్లు)కు చేరుకుంది. ట్విటర్ షేర్లలో డోర్సికి 2.3శాతం వాటా ఉంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన ఆయన అనేక పదవుల్లో ఒదిగిపోయి చివరికి సీఈవో స్థాయికి ఎదిగారు. స్క్వేర్ మొబైల్ పేమెంట్ సంస్థనూ ఆయన స్థాపించారు. పాడ్ కాస్ట్ షో లో డోర్సి తన దినచర్యను విపులీకరించారు. తెల్లవారగానే మూడు నిమిషాల పాటు చల్లటి నీటితో స్నానం చేశాక 15 నిమిషాలు 104 డిగ్రీల సెంటిగ్రేడ్ ఆవిరిలో ఉంటారట. గంట పాటు ధ్యానం కూడా తన దినచర్యలో భాగంగా ఉంటుందని తెలిపారు. సాయంత్రం ప్రొటీన్, సలాడ్ తీసుకొని రాత్రి వేళ బెర్రీలు, లేదా డార్క్ చాక్లెట్ తింటారట. ఈ విధంగా దినచర్య, ఆహార నియమాలు పాటించడం వల్ల రోజూ పగటి వేళ ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పని చేయగల్గుతున్నట్లు వివరించారు. ఇలా 22 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నట్లు డోర్సి చెప్పారు.

Pet deer kills man in Australia in rare attack


ఆస్ట్రేలియాలో పెంపుడు లేడి దాడిలో భర్త మృతి భార్యకు గాయాలు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు 200 కి.మీ. దూరంలోగల వంగరట్టా గ్రామంలో బుధవారం(ఏప్రిల్17)ఉదయం పెంపుడు లేడి దాడిలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. భర్త లేడికి ఆహారం అందిస్తుండగా కొమ్ములతో కుమ్మేసింది. ఘటనను చూసి అతనికి సహాయంగా భార్య వచ్చింది. దాంతో ఆమె పైనా లేడి దాడికి దిగింది. భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు సార్జంట్ పాల్ పర్సెల్ విలేకర్లకు తెలిపారు. భార్య,భర్తల వయసు 46 కాగా వీరికి 10 ఏళ్ల కొడుకున్నాడు. లేడి తల్లి పైనా దాడి చేస్తుండడం చూసిన కొడుకు రక్షించడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సమీపంలోని కర్రతో ఎదురుదాడికి దిగి ఆ లేడి నుంచి తల్లిని రక్షించినట్లు సమాచారం. ఇటువంటి పెంపుడి జంతువుల దాడిలో మనుషులు చనిపోయిన, గాయపడిన ఘటనలు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో జరగలేదని తెలిసింది. ఈ సీజన్ లో ఎద సమయం కావడంతో లేడి విపరీతమైన కోపోద్రిక్తలకు గురికావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జంతుశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.