మెగా కాంపౌండ్ లో అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించిన హీరో పవన్ కల్యాణ్ తన మనసులో మాటను మరోసారి కుండబద్దలు కొట్టారు. అన్నయ్య చిరంజీవే తనకు స్ఫూర్తి ప్రదాత అని పునరుద్ఘాటించారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా అపురూపమైన రీతిలో పవర్ స్టార్ స్పందించడం మెగా అభిమానులందర్ని ఓలలాడించిందనే చెప్పాలి. నటుడిగానే కాక జనసేన అధినేతగానూ నిత్యం వార్తలో ఉండే పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై తనకుగల ఆరాధ్య భావనను మరోసారి అఖిలాంధ్ర అభిమానులతో లేఖారూపంగా పంచుకున్నారు. శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమని పవన్ పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా అవతరించారని ప్రశంసించారు. అన్నయ్యే నా తొలి గురువు అని పవన్ ఈ భావోద్వేగ సందేశంలో ప్రకటించారు. `అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో అన్నయ్య చిరంజీవిని అంతే పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చెయ్యి పట్టుకునే పెరిగాను. అన్నయ్య నన్ను అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నడిపించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగు వారు సగర్వంగా `చిరంజీవి మావాడు` అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం` అని పవర్ స్టార్ స్పష్టం చేశారు. `ఆయనకు చిరాయువుతో కూడిన శుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు` అని పవన్ పేర్కొన్నారు.