Saturday, February 22, 2020

Yediyurappa Govt. in Karnataka follows AP CM YSJagan`s decentralization idea

జగన్ ను అనుసరిస్తున్న యెడ్డీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా బెంగళూర్ నుంచి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని కర్ణాటక బీజేపీ సర్కార్ తరలించాలని నిర్ణయించింది. అయితే యడ్యూరప్ప ఏపీలో మూడు రాజధానుల అంశంపై మాత్రం పెదవి విరిచినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీకి చెందిన వివిధ స్థాయుల్లోని నాయకులు ఇప్పటికే అనేక సందర్భాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ ఆలోచనగా పేర్కొన్నారు. అంతే తప్పా రాజధాని వికేంద్రీకరణ (ఒకటికి మించిన రాజధానుల ఏర్పాటు)ను తమ పార్టీ కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. తాజాగా కర్ణాటకలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు బీజేపీ అధిష్ఠానం అంగీకారం తెలిపింది. ఇప్పటికే రాజధాని బెంగళూరు ట్రాఫిక్ సమస్యతో సతమతమౌతోంది. ఈ దృష్ట్యా ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యడ్యూరప్ప సర్కారు సిద్ధమైంది. అదే సమయంలో ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని యోచించింది. కొన్ని కార్యాలయాలను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్లు మంత్రి ఈశ్వరప్ప ప్రకటించారు. కృష్ణ భాగ్య జలనిగం, కర్ణాటక నీరావరి నిగమ్, పవర్ లూమ్ కార్పొరేషన్, షుగర్ డైరెక్టరేట్, చెరకు డెవలప్‌మెంట్ కమిషనర్, కర్ణాటక హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉప లోకాయుక్త తదితర మొత్తం 9 కార్యాలయాల్ని తరలించాలని తలపోస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావికి ఈ కార్యాలయాలు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో జాతీయరహదారి నం.4 సమీపంలో గల బెళగావిలో `సువర్ణ విధాన సౌధ`ను కర్ణాటక ప్రభుత్వం 2012లోనే నిర్మించింది. బెంగళూరుతో పాటు ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. కర్ణాటక అప్రకటిత రెండో రాజధానిగా ఉన్న బెళగావికి ముఖ్య కార్యాలయాలు తరలితే ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగం పుంజుకోగలదని యడ్యూరప్ప సర్కారు భావిస్తోంది.