Wednesday, July 8, 2020

AP CM YS Jagan unveils 'Nalo Natho' book a biography on YSR Written by YSVijayamma

మహానేత రాజన్నకు సీఎం జగన్ ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి జననేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వై.ఎస్.ఆర్ 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రమే అమరావతి నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. కరోనా నెగెటివ్ పత్రాలు ఉన్న వారినే పోలీసులు సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో అనుమతించారు. ఈ సందర్భంగా మహానేత సతీమణి విజయమ్మ ఆయనపై రాసిన `నాలో..నాతో..వైఎస్ఆర్` పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. నాన్న వై.ఎస్. లో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన జీవనగమనంలో చూసిన విధానాన్ని అమ్మ విజయమ్మ ఈ పుస్తక రూపంలో జనం ముందుకు తీసుకువచ్చారని జగన్ అన్నారు. నాన్న జయంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 37 ఏళ్ల సహచర్యంలో తన భర్త వై.ఎస్.లో చూసిన గొప్ప గుణాలు, మూర్తిభవించిన మానవత్వాన్ని ప్రజలతో పంచుకునేందుకే ఈ పుస్తకాన్ని రాసినట్లు విజయమ్మ తెలిపారు.