Saturday, May 11, 2019

india vietnam target $15billion trade by 2020



వియత్నాంతో భారత్ రూ.లక్ష కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా అడుగులు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ నేతల్ని కలుసుకున్నారు. ఆయన వియత్నాం వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి న్యాగో థిన్, ప్రధానమంత్రి నగైయెన్ జువాన్ ఫాక్ తదితర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం, రాజకీయ, రక్షణ, భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. భారత్, వియత్నాంలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించాయి. న్యాగోథిన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆగ్నేయాసియా (ఏషియాన్)లో భాగస్వామ్య దేశాలైన భారత్, వియత్నాంలు 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.లక్షా 4వేల కోట్ల (15బిలియన్ డాలర్లు) స్థాయికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదిగా ఉభయ దేశాలు రూ.94 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. 2007 నుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో ఉండగా ద్వైపాక్షిక వాణజ్యం రూ.54వేల కోట్ల స్థాయిలో జరిగింది. ప్రత్యేకించి ఈ ఏడాది నుంచి ఐ.టి.రంగం, ఎనర్జీ, పునరుత్పాదక శక్తి రంగం, మౌలికసౌకర్యాలు, ఆధునిక వ్యవసాయం, ఆయిల్, గ్యాస్ ఉత్పాదన తదితర రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించాయి.


fani cyclonic storm:south central railway loses around Rs.3 crore


 దక్షిణ మధ్య రైల్వేకు ఫొని నష్టం రూ.2.98కోట్లు
గత వారం బీభత్సం సృష్టించిన ఫొని తుపాన్ ధాటికి దక్షిణ మధ్య రైల్వే(ఎస్.సి.ఆర్) సుమారు రూ.2.98 కోట్లు నష్టపోయింది. తుపాన్ సమయంలో 137 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో రూ.2,97,92,581 ఆదాయాన్ని కోల్పోయినట్లు ఎస్.సి.ఆర్ వర్గాలు తెలిపాయి. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయితే మరికొన్ని వేరే మార్గాలకు మళ్లించి నడిపారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతకే పూర్తి ప్రాధాన్యం ఇచ్చి రైల్వే వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫొని తుపాన్ విరుచుకుపడుతున్న సమయానికే ఎస్.సి.ఆర్ సర్వసన్నద్ధతతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తుపాన్ అనంతరం మే4,5 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్-భువనేశ్వర్, విజయవాడ-హౌరా, సికింద్రాబాద్-హౌరాలకు నడిపింది. మొత్తం 3,034 మంది వీటిల్లో ప్రయాణించారు. తద్వారా రూ.20.90 లక్షల ఆదాయం వచ్చింది. ఫొని మే3న ఒడిశాలోని పూరిని అతలాకుతంల చేసిన సంగతి తెలిసిందే. తుపాన్ తాకిడికి కోటీ 50లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 14 జిల్లాల్లో కనీస, నిత్యావసర సేవలకు విఘాతం కల్గింది. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేక జనం ఇక్కట్లకు గురయ్యారు.