Wednesday, May 1, 2019

foni cyclone threat people evacuated from hope island in east Godavari district


ఫొని తుపాన్ ను ఎదుర్కొనేందుకు ఏపీ సర్వసన్నద్ధం
మచిలీపట్నానికి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఫోని తుపాన్ మరికొన్ని గంటల్లో విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉంది. దాంతో విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమయింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం 18 కోస్తా మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయన విలేకర్లకు వివరాల్ని తెలిపారు. తుపాను నెమ్మదిగా వాయువ్య దిశ వైపు కదులుతోందని దీని ప్రభావంతో ప్రచండమైన గాలులతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా తుని, తొండంగి మండలాలపై ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందంటూ ప్రత్యేక రక్షణ బృందాల్ని అమలాపురం, కాకినాడల్లో మోహరించామని తెలిపారు. రోడ్ల నిర్వహణ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ముప్పు పొంచి ఉన్న అన్ని మండలాల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బందిని సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇటీవల పోలింగ్ పూర్తైనందున ఈవీఎంల భద్రత గురించి కూడా ఆయన వివరిస్తూ వాటిని అత్యంత సురక్షితంగా ఉంచినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల కిటికీలను మూడేసి వరుసల పాలిథిన్ కవర్లతో కప్పి ఉంచామన్నారు.

Cop dies as rifle goes off accidentally


ప్రమాదవశాత్తు తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి
మధ్యప్రదేశ్ కెజాడియా గ్రామంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. బుధవారం జరిగిన ఘటనలో 23 కానిస్టేబుల్ విధుల్లో ఉండగా చేతిలోని తుపాకీ నుంచి ఒక్కసారిగా బుల్లెట్ వెలువడింది. అతని గడ్డం నుంచి తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలొదినట్లు తెలుస్తోంది. మృతి చెందిన కానిస్టేబుల్ రాత్రి వేళ విధుల్ని మరో సహచరుడితో కలిసి చేపట్టినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కానిస్టేబుల్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పోలీస్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

16 security personnel killed in ied blast in gadchiroli



మహారాష్ట్రలో బాంబు పేలుడు 16 మంది పోలీసుల దుర్మరణం
శక్తిమంతమైన బాంబు పేలుడు ఘటనలో 16 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరొలి జిల్లాలో బుధవారం (మే1) ఈ దారుణం జరిగింది. నాగ్ పూర్ కి 250 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక పోలీసు బలగాలు ప్రయాణిస్తున్న వాహనాల్ని తీవ్రవాదులు ఐ.ఇ.డి బాంబుతో పేల్చేశారు. ఆ ప్రాంతంలో మంగళవారం రోడ్డు నిర్మాణ కంపెనీకి చెందిన 25 వాహనాల్ని మావోలు తగులబెట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు బయలుదేరాయి. కొర్చి కి రెండు వాహనాల్లో బయలుదేరిన పోలీసు బలగాలు దాదాపూర్ రోడ్డు కి చేరుకోగానే తీవ్రవాదులు మాటు వేసి బాంబును చాకచాక్యంగా పేల్చడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు దుర్మరణం చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సి-60 ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన మొత్తం 25 మంది పోలీసులు రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు తునాతునకలయ్యాయి. వ్యూహాత్మకంగా మావోలు ఈ ఘాతుకానికి తెగబడినట్లు స్పష్టమౌతోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవస్ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీతో పరిస్థితిని సమీక్షించామని రాష్ట్రంలో యావత్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రధాని మోదీ తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృత వీరులకు వందనాలు తెల్పుతూ వారి త్యాగాల్ని ఎన్నటికి మరువమన్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావాన్ని తెల్పుతూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.