Sunday, August 11, 2019

Abrogation of 370 is the need of the hour: Vice President venkaiah Naidu


జమ్ముకశ్మీర్ లో 370 అధికరణం రద్దు అనివార్యం: ఉపరాష్ట్రపతి
దేశ భద్రత, సమగ్రతల కోణంలో ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అత్యవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం చెన్నైలో ఆయన తన రెండేళ్ల పదవీకాలంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. 370 అధికరణం రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభించినందున ఇప్పుడు ఆ విషయంపై తను స్వేచ్ఛగా మాట్లాడుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ తనను జమ్ముకశ్మీర్ ను చూశారా? అని ప్రశ్నించినట్లు ఉపరాష్ట్రపతి చెప్పారు. మన ముఖంలో ఉండే రెండు కళ్లు కూడా ఒకదాన్ని మరొకటి చూడలేవు..కానీ ఒక కంటికి బాధ కల్గితే రెండో కంట్లోనూ నీరు ఉబికి వస్తుందని వెంకయ్య అన్నారు. అదే విధంగా భారత జాతి ప్రయోజనాల రీత్యా దేశమంతా ఏకరీతిగా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలన్న తేడా లేకుండా సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలన్నారు. జమ్ముకశ్మీర్ లో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలై ప్రగతి నెలకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు వల్ల ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. తమ పార్టీకి రాజ్యసభలో కనీస మెజార్టీ లేదని.. 370 ఆర్టికల్ రద్దు బిల్లును తొలుత ఆ సభలోనే ప్రవేశపెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు నాటి పరిస్థితులు నెలకొంటాయేమోనన్న చిన్న సందేహం కల్గిందన్నారు. అయితే పెద్దల సభలో బిల్లు సజావుగా ఆమోదం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అపొలో హాస్పిటల్స్ చైర్మన్ పి.సి.రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.కస్తూరి రంగన్, వి.ఐ.టి. వ్యవస్థాపకులు, చాన్స్ లర్ జి.విశ్వనాథన్ తదితరులు ఉపరాష్ట్రపతిని ఈ సందర్భంగా అభినందించారు.