Friday, January 7, 2022

Chandrababu road show in Own constituency Kuppam

కుప్పంలో చంద్రబాబు విస్తృత పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన కుప్పం విచ్చేశారు. ఇటీవల ఆయన తరచు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గ్రామగ్రామాన ప్రజల సాధకబాధలను తెలుసుకునేందుకే బాబు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తే ఓటమి పాలు కావడం ఖాయమని వైఎస్ ఆర్ సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని సైతం పాలకపక్షానికి టీడీపీ కోల్పోవడం ఆ పార్టీని కుంగదీసింది. మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయంలో తన పంతం నెగ్గించుకున్నట్లు పాలక వర్గాలు కాలరేగరేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తనపట్టు చెక్కుచెదరలేదని పార్టీ శ్రేణులకు సైతం స్పష్టం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కుప్పం తాజా పర్యటన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమ అధినేతకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అదే ఉత్సాహంలో ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటనకు వచ్చినట్లు బాబు స్వయంగా వెల్లడించారు. మూడ్రోజుల పాటు (శనివారం వరకు) నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. తను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పాలకపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే ప్రతిదెబ్బ తనకు తగిలినట్లుగానే భావిస్తానని పేర్కొన్నారు.