ఈజిప్ట్ లో కరోనా కట్టడికి రోబో సేవలు
కరోనా సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో ఈజిప్ట్ లో రోబోల్ని రంగంలోకి దింపారు. మహమూద్ ఎల్-కోమి అనే ఆవిష్కర్త ఈ రిమోట్-కంట్రోల్ రోబోట్‌ను సిద్ధం చేశాడు. దాంతో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో ఈ రోబో సేవల్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. సిరా-03 అని పిలువబడే ఈ రోబోట్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగలదు. రోగుల ఉష్ణోగ్రతను పరీక్షిస్తుంది. అదేవిధంగా మాస్క్ లు ధరించని వారిని హెచ్చరిస్తుంది. అచ్చం మనిషిలాంటి తల, మొహం, చేతులతో ఈ రోబోట్ ను తీర్చిదిద్దారు. ఈ మరమనిషికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వైద్యుల మాదిరిగా ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు చేయగలదు. అంతేకాకుండా ఆ రిపోర్టు ఫలితాలను దాని ఛాతీకి అనుసంధానించిన తెరపై రోగులకు ప్రదర్శిస్తుంది. ఈ రోబోట్లను మనుషుల్లా రూపొందించడమెందుకంటే రోగులు భయపడకుండా ఉండడానికేనని మహమూద్ తెలిపాడు.