Tuesday, July 30, 2019

Triple talaq bill passed by Parliament


ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర
దేశంలో వివాహిత ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ లోనూ గట్టెక్కింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్.పి, బీఎస్పీలు సభకు హాజరుకాలేదు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. సభ నుంచి వాకౌట్ చేసింది. కూటమి మిత్ర పక్షం జేడీయూ కూడా వాకౌట్ చేయడం గమనార్హం. వై.ఎస్.ఆర్.సి.పి, టి.ఆర్.ఎస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఎంపీలు ఓటేయగా 84 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. దాంతో రాజ్యసభ లోనూ బిల్లు ఆమోదం పొందగల్గింది. ఎగువ సభలో మోదీ ప్రభుత్వానికి వాస్తవంగా 107 మంది ఎంపీల బలముంది. బిల్లు ఆమోదానికి 121 ఓట్లు అవసరం. ఎస్.పి, బీఎస్పీ సభ్యులు సభకు హాజరుకాకపోవడం, టి.ఆర్.ఎస్, వై.ఎస్.ఆర్.సి.పి. సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు కు రాజ్యసభ లో కూడా ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి అమలులో ఉన్న ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చి అమలులోకి రానుంది.