Saturday, July 27, 2019

All 1,050 passengers of stranded Mahalaxmi Express rescued:Railways


ఈ నీళ్ల పైన రైలుంది
·       ముంబయిలో పోటెత్తిన వరదలు
·       మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 1050 మంది ప్రయాణికుల తరలింపు
కుంభవృష్టి తాజాగా మహారాష్ట్రలోని ముంబయి, థానేల్ని అతలాకుతలం చేసింది. ఉల్హాస్ నది పోటెత్తడంతో సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే ట్రాక్ లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి కోల్హాపూర్ బయలుదేరిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరదల తాకిడికి ముంపునకు గురై నిలిచిపోయింది. బద్లా పూర్, వంగణి రైల్వే స్టేషన్ల మధ్యమార్గంలో రైలు వరద పోటెత్తి ప్రవహించడంతో జలదిగ్బంధనానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 1050 మంది రైల్లోనే చిక్కుబడిపోయారు. వారందర్ని శనివారం మధ్యాహ్నం సహాయ రక్షణ బృందాలు సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మొత్తం ప్రయాణికులందర్ని వారు చేరుకోవాల్సిన గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో మరో రైలులో తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షానికి వరద పోటెత్తడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రైల్వే ట్రాక్ ముంపునకు గురైంది. గంటల కొద్దీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణికులు కాలం గడిపారు. శనివారం ఉదయానికే సహాయ రక్షణ బృందాలు రైలు జలదిగ్బంధానికి గురైన ప్రాంతానికి చేరుకున్నాయి. భారత నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వీరికి సహకరించారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టిన సెంట్రల్ రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)  ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడాయి. లైఫ్ జాకెట్లు, బోట్ల తో భారత నేవీ బృందం కూడా వరదల్లో దిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా తీరానికి చేర్చడానికి సహకరించింది. వెలుపలికి తీసుకువచ్చిన ప్రయాణికుల్ని తొలుత బద్లాపూర్ లోని కన్వెన్షన్ హాల్ కు తరలించారు. వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుల్లో కొందర్ని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ రైల్వే సిబ్బంది ప్రయాణికులంతా తేరుకున్నాక వారి గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో ప్రత్యేక రైలులో తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది.