టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా
విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖకు ఉక్కు నగరంగా పేరొచ్చిందన్నారు. ఇక్కడ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయడమంటే మనిషి తలను మొండెం నుంచి వేరుచేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామాలిచ్చి ఉద్యమంలో పాల్గొనగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనల్ని ఉద్ధృతం చేశాయి. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వారికి మద్దతుగా నిలవడం విశేషం. శనివారం నగరంలో చేపట్టిన ఆందోళనలో అందరూ పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాడు ఉద్యమకారులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోమని ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు.