Sunday, August 18, 2019

Two Nigerians held for duping Chandigarh woman of Rs 44 lakh


మహిళకు రూ.44 లక్షల టోకరా: ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
ఫేస్ బుక్ చాటింగ్ తో మహిళ నుంచి రూ.44 లక్షలు కాజేసిన ఇద్దరు నైజీరియా ఘరానాలను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. చండీగఢ్ సమీపంలో రాజ్‌నంద్ గావ్‌కు చెందిన మహిళను బురిడీ కొట్టించిన నిందితులు కిబీ స్టాన్లీ ఓక్వో (28), న్వాకోర్ (29)లను రాజధాని ఢిల్లీలోని చాణక్య ప్లేస్ లో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సుమారు 8 నెలల పాటు దర్యాప్తు నిర్వహించిన రాజ్‌నందగావ్ పోలీసులు ఢిల్లీలో నిందితుల ఆచూకీ కనుగొని శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు.  ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్నీఅరెస్టు చేసినట్లు రాజ్‌నందగావ్ పోలీసు సూపరింటెండెంట్ కమ్లోచన్ కశ్యప్ తెలిపారు. ఢిల్లీ నుంచి వీరిని ట్రాన్సిట్ రిమాండ్లో ఆదివారం రాజానందగావ్ కు తీసుకువచ్చారు. ఈ కేసు ఫిర్యాదు గత ఏడాది డిసెంబర్‌లో నమోదైంది. స్టేషన్ పారాకు చెందిన బాధితురాలు తన భర్త పేరిట ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్‌లో డేవిడ్ సూర్యన్ అనే యూజర్ నుంచి గత ఏడాది జులైలో ఆమె తనకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించింది. అతను లండన్ లో ఓ షిప్ కెప్టెన్ గా పని చేస్తున్నట్లు పేర్కొని చాటింగ్ కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ల్యాప్‌టాప్, మొబైల్, డైమండ్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల్ని ప్రత్యేక బహుమతులుగా పంపుతున్నట్లు అబద్ధాలు వల్లించాడు.  ఆ తర్వాత ఢిల్లీలోని కస్టమ్స్ ఆఫీసర్ నంటూ మరో నిందితుడు నమ్మబలుకుతూ ఆమెకు ఫోన్ కాల్ చేశాడు. బహుమతుల్ని స్వీకరించడానికి కస్టమ్స్ డ్యూటీగా సుమారు రూ.62,500 చెల్లించాలని కోరాడు. బాధితురాలు ఆ డబ్బు ఆన్ లైన్ అకౌంట్ ద్వారా చెల్లించింది. బహుమతుల క్లియరెన్స్ కోసం సర్వీస్,డాక్యుమెంట్,ప్రాసెసింగ్ ఛార్జ్, ఆదాయపు పన్ను తదితరాలకు డబ్బు చెల్లించాలంటూ ఆమెకు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెయిల్స్ వచ్చాయి. దాంతో బాధితురాలు గత ఏడాది జులై-నవంబర్ మధ్య రూ.44 లక్షలు చెల్లించింది. అయితే ఆ తర్వాత ఆమెకు ఏ బహుమతులు అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి డిసెంబర్ 1 న కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. నిందితులు ఉపయోగించిన డబ్బు, మొబైల్ నంబర్లు, ఇ-మెయిల్ ఐడీ, బాధితురాలు బదిలీ చేసిన సొమ్ము జమ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా గుర్తిస్తూ కేసు చిక్కుముడిని విప్పారు. చివరకు దర్యాప్తులో నిందితుల స్థావరం ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందం మెరుపుదాడి చేసి నిందితులిద్దర్నీ పట్టుకుని వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 34 (ఉమ్మడి ఉద్దేశం) 66 డి (కంప్యూటర్ ద్వారా మారు వేషంలో మోసం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.