Saturday, August 17, 2019

PM Modi in Bhutan: RuPay card launched, 9 MOUs exchanged

భూటాన్ లో రూపే కార్డు సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోది

భారత ప్రధాని నరేంద్ర మోది భూటాన్ లో శనివారం రూపే కార్డు సేవల్ని ప్రారంభించారు. మోది ఆ దేశ ప్రధాని డాక్టర్ లోటే షెరింగ్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య   విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మాంగేదాచులో జలవిద్యుత్ కేంద్రాన్నీ ప్రధాని ప్రారంభించారు. అనంతరం థింపులో ఇస్రో ఎర్త్ స్టేషన్ నూ మోది ఆరంభించారు. హిమాలయ సానువుల రాజ్యంలో రూపే సేవలు ప్రారంభమవ్వడం పట్ల మోది సంతోషం వ్యక్తం చేశారు. `రూపే కార్డు సేవలు ఆరంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది` అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత మే లో ఆయన సింగపూర్ లోనూ ఈ కార్డును ప్రారంభించారు. దాంతో ఉభయదేశాల ప్రజలు డిజిటల్ వాలెట్ (పరస్పర నగదు మార్పిడి ఆమోదం) సేవల్ని వినియోగించే అవకాశం కల్గింది. తాజాగా భారత్ రూపే కార్డు డిజిటల్ సేవలు అమలవుతున్న రెండో దేశంగా భూటాన్ నిలుస్తోంది. మార్చి నుంచే భూటాన్ లో ఈ కార్డు సేవల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తద్వారా భారత్ భూటాన్ ల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాల్లో ఇతోధిక పురోగతిని ఆశిస్తున్నారు. సింగపూర్ లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ద్వారా డిజిటల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా భారత్ లో ఈ రూపే కార్డు ద్వారా రిటైల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ ఫర్ సేవల గొడుగులా ఎన్.పి.సి.ఐ. పనిచేస్తోంది. రూపే కార్డులు మరికొన్ని దేశాల్లోనూ అమలులో ఉన్నాయి.