Saturday, February 1, 2020

Nirmala Sitaraman follows the same sentiment in 2020 Budget

సెంటిమెంటును కొనసాగించిన ఆర్థికమంత్రి సీతారామన్
బడ్జెట్-2020 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది సెంటిమెంట్ ను కొనసాగించారు. 2020-21 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి శనివారం ఆమె పార్లమెంట్ కు చేరుకునే ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అనంతరం సీతారామన్ లోక్ సభ కు విచ్చేశారు. క్రితంసారి మాదిరిగానే ఆమె ఎర్రటి వస్త్రాల్లో చుట్టిన బడ్జెట్ ప్రతుల్ని తీసుకుని వచ్చారు. గతేడాది ఆమె ఎర్ర చీరను ధరించగా ఈసారి పసుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె కశ్మీరీ కవి దీనానాథ్ కౌల్ రాసిన కవితను చదవి వినిపించారు. నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం.. మానవత్వం.. దయతో కూడిన సమాజం అవసరం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిదిఅంటూ ఆ కవితకు అర్థాన్ని ఆర్థికమంత్రి వివరించారు. తమ బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని చెప్పడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆమె తమిళంలో చెప్పిన కథ ను మరోసారి గుర్తు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ప్రతుల బండిళ్లను ప్రత్యేక వాహనంలో పార్లమెంట్ కు తరలించారు. పార్లమెంట్ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్‌జీ టీం బడ్జెట్ ప్రతుల భద్రతను పర్యవేక్షించారు.