సమూలంగా ఎన్నికల సంస్కరణలు అవసరం: హజారే
దేశంలో ఎన్నికల అక్రమాలు అరికట్టడానికి సమూలంగా సంస్కరణలు తీసుకురావాల్సి
ఉందని ప్రముఖ సామాజిక సేవ, ఉద్యమకర్త అన్నా హజారే అభ్రిపాయపడ్డారు. విలేకరులతో
మాట్లాడుతూ ఆయన ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య
వ్యవస్థకు ఓటర్లు మూల స్తంభాలన్నారు. ప్రస్తుత రాజకీయాల వల్ల అటు పార్లమెంట్,
అసెంబ్లీల పవిత్రత అడుగంటిపోతోందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో
పార్టీలు, గుర్తులతో పోటీ ఎందుకన్నారు. భారత సంవిధానంలో ఎక్కడా పార్టీలు, గుర్తుల
ప్రస్తావన లేదని కేవలం వ్యక్తి(నాయకుడు) అని మాత్రమే రాజ్యాంగ
నిర్మాతలు రాశారని హజారే గుర్తు చేశారు. 25 ఏళ్లు నిండిన భారతీయ పౌరులెవరైనా పోటీ
చేయొచ్చన్నారు. ప్రజల్ని ఏదోవిధంగా మభ్యపెట్టి డబ్బు ఎరవేసి లోబర్చుకుని రాజకీయ
పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు, గుర్తుల
విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) పలుమార్లు మనవి చేసినా స్పందన లేదని
చెప్పారు. ప్రధాని మోదీకి అనేక అంశాలపై 32 లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆయన
విచారం వ్యక్తం చేశారు. లోక్ పాల్ దృష్టికి కూడా ఎన్నికల అవకతవకల విషయాన్ని
తీసుకెళ్లానన్నారు. కచ్చితంగా ఈ అక్రమ దందాకు ఏదో ఒక రోజు చరమగీతం పాడగలమని హజారే
ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఈనెల 23న అహ్మద్
నగర్(మహారాష్ట్ర) లో ఓటు హక్కు వినియోగించుకుంటానని 81 ఏళ్ల హజారే తెలిపారు. సరైన
అభ్యర్థికే ఓటు వేస్తానని లేదంటే నోటా (none of the above) బటన్ నొక్కుతానని చెప్పారు.