Friday, January 15, 2021

Rahul Gandhi attends Tamilanadu Jallikattu Celebrations

జల్లికట్టుకు హాజరైన రాహుల్ గాంధీ

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  పొంగల్ వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మదురై సహా ఆయా ప్రాంతాల్లో జోరుగా జల్లికట్టు నిర్వహించారు. అవనియపురంలో వార్షిక జల్లికట్టు (బుల్ టామింగ్) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,  ద్రవిడ మున్నేట్రా కగం (డిఎంకె) యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే ఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణసామి సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతికి మద్దతుగా తను ఇక్కడకి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరుకావడంపై చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడివి అవకాశవాద రాజకీయాలని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధానికి యూపీఏ ప్రభుత్వం కారణమని అవనిపురానికి రావడానికి రాహుల్ కు నైతిక హక్కు లేదు అని విమర్శించారు.