Wednesday, April 10, 2019

rahul first century knock in ipl


రాహుల్ ఐపీఎల్ తొలి సెంచరీ
·   ఉత్కంఠపోరులో ముంబయి ఇండియన్స్ గెలుపు
ముంబయి వాంఖేడ్ స్టేడియంలో పరుగుల వరద పారింది. తొలుత కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ రాహుల్, గేల్ పరుగుల వర్షం కురిపిస్తే లక్ష్య సాధనలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ పోలార్డ్ పరుగుల సునామి సృష్టించి జట్టును గెలిపించాడు. 31 బంతుల్లో 83 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్ మన్ కె.ఎల్. రాహుల్ తుపానులా చెలరేగి ఆడడంతో ముంబయి ఇండియన్స్ పై ఆ జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచింది. రాహుల్ కేవలం 63 బంతుల్లోనే 100 సాధించాడు. అతనికి ఐ.పి.ఎల్. లో ఇదే తొలి సెంచరీ. రాహుల్ 6 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో టి-20 ఫార్మాట్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. సెంచరీలో -60 పరుగుల్ని రాహుల్ కేవలం సిక్సర్లు, బౌండరీల ద్వారానే సాధించాడు. అంతకు ముందు మరో ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తుపాన్ బీభత్సంలా విరుచుకుపడి అర్ధ సెంచీర సాధించడంతో 10 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 దాటింది. అతని అవుట్ తర్వాత రాహుల్ ఆ బాధ్యతను తీసుకుని ముంబయి ఇండియన్స్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఆఖరి ఓవర్లో బుమ్రా తొలిబంతినే సిక్సర్ గా మలిచి రాహుల్ సెంచరీ దిశగా వేగంగా దూసుకువెళ్లాడు.  క్రికెట్ గోడగా పిలువబడే రాహుల్ ద్రవిడ్ ను కె.ఎల్.రాహుల్ తలపిస్తున్నాడు. పేర్లలోనే కాకుండా ఆటలోను ఇద్దరిది ఒక్కటే శైలి కావడం విశేషం. ఇద్దరూ కర్ణాటకకే చెందిన వారు కావడం మరో విశేషం.
ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి వైదొలగగా ఆ బాధ్యతల్ని పోలార్డ్ చేపట్టాడు. బ్యాటింగ్ వికెట్ అయిన ముంబయి వాంఖేడ్ స్టేడియంలో కింగ్స్ లెవన్ పంజాబ్ ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ ముందు భారీ లక్ష్యమే ఉంచగలిగింది. పంజాబ్ 197/3 పరుగులు చేసింది. ముంబయి 198 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ దిగి ఆది నుంచి పరుగులు సాధించే క్రమంలో పరుగులతో పాటు త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఎనిమిది ఓవర్లలో 58 పరుగులకు రెండు వికెట్లను పోగొట్టుకుంది.
ఆఖరి ఓవర్ నువ్వా..నేనా
ముంబయి ఇండియన్స్ గెలిచిందంటే కేవలం పోలార్డ్ వల్లే అని చెప్పొచ్చు. ఆఖరి ఓవర్లో అప్పటికే జట్టు 6 వికెట్లు కోల్పోయిన దశలో 15 పరుగులు చేయాల్సి ఉంది. అంకిత్ పటేల్ వేసిన తొలి బంతి నోబాల్ కాగా దాన్ని పోలార్డ్ సిక్సర్గా మలిచాడు. తర్వాత ఫ్రీ హిట్ను ఫోర్ కొట్టాడు. అయితే రెండో బంతి భుజం ఎత్తును దాటగా పోలార్డ్ హుక్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. చివర్లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు రావాల్సి ఉంది. చివరి బంతికి కావాల్సిన రెండు పరుగుల్ని అజ్ఘరి సాధించడంతో ముంబయి ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ పోలార్డ్ కు దక్కింది.