Sunday, August 25, 2019

Muslims cremate Hindu friend in Assam village


సోదర హిందువుకి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు
అసోంలో మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. కామరూప్ జిల్లా హిందూముస్లింల సఖ్యతకు అద్దం పట్టింది. ఆదివారం కండికర్ గ్రామంలో ఓ వృద్ధ హిందువుకి దహనసంస్కారాల్ని ముస్లిం సోదరులు నిర్వహించిన ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల రాజ్ కుమార్ గౌర్ శనివారం మరణించారు. దాంతో ఏళ్ల తరబడి అక్కడ జీవనం సాగిస్తున్న ఆయనకు స్థానిక ముస్లింలే అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అసోం వలస వచ్చిన రాజ్ కుమార్ కుటుంబం తొలుత రైల్వే కార్టర్స్ లో నివాసం ఉండేవారు. 1990లో తండ్రి మరణించడంతో రాజ్ కుమార్ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో సద్దాం హుస్సేన్ అనే ముస్లిం తన ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పించారు. రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. వారిద్దరూ ముస్లిం యువకుల్నే పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ కూడా దశాబ్దాలుగా ముస్లింలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ముస్లింల పండుగలు, పెళ్లి వేడుకల్లో రాజ్ కుమార్ పాల్గొంటూ వాళ్ల బంధువుగా మెలిగారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడంతో కండికర్ గ్రామ ముస్లింలే దహన సంస్కారాలకు పూనుకున్నారు. అందుకు అవసరమయ్యే సామగ్రి తదితరాల గురించి తమను అడిగి తెలుసుకున్నట్లు పొరుగున గల ఉపెన్ దాస్ గ్రామవాసులు తెలిపారు. ఒక బ్రాహ్మణుడ్ని ఏర్పాటు చేసుకుని వారు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఇటీవల ఎన్.ఆర్.సి. పున: నమోదు (రీ వెరిఫికేషన్)కు అసోం పశ్చిమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలకు శివసాగర్, చారయిడియో జిల్లాల హిందూ యువకులు ఆశ్రయం కల్పించి ఆదరించిన సంగతి తెలిసిందే.