Thursday, February 24, 2022

Russia Attacks Ukraine, Air Raid Sirens Reported In Capital Kyiv

వార్ వన్ సైడ్

రష్యా అన్నంత పని చేసింది. ఉక్రెయిన్ తమ దేశంలో భాగమేనని మొదటి నుంచి చెబుతున్న రష్యా గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) యుద్ధం ప్రకటించింది. గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ కీలక నగరాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్ ప్రతిఘటించి తీరతామని రష్యాకు సవాలు విసిరింది. రష్యా ఏకపక్ష దాడి, దురాక్రమణను ఐక్యరాజ్యసమితి అడ్డుకోవాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. బదులు చెప్పి తీరతామని రష్యాను అమెరికా మరోసారి హెచ్చరించింది. అధ్యక్షుడు జోబైడన్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. మరో వైపు ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. రష్యా సైనిక చర్యను నిలిపివేయాలని కోరింది. ఇప్పటికే రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్ ను రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్ లోని 23 అతికీలక ప్రాంతాల్లో రష్యా సైన్యం బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడి జరిపింది. త్రిముఖవ్యూహంతో ఉక్రెయిన్ భూభాగాన్ని చుట్టిముట్టిన రష్యా క్రమక్రమంగా ఆ దేశంలోకి చొచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఉక్రెయిన్ హైవేలపై జనం పెద్ద సంఖ్యలో కార్లలో తరలిపోవడం కనిపిస్తోంది. ఇప్పటికే 11 నగరాల్లో రష్యా బలగాలు పాగా వేసినట్లు సమాచారం. బోరిస్పిల్, డాన్ బాస్, ఖార్కిన్, ఒడెస్సా, మరియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగుతోంది. వాయు,జల, భూమార్గాల్లో రష్యా ముప్పేట దాడి చేస్తూ ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెలారెస్, క్రిమియాలు రష్యాకు మద్దతుగా యుద్ధభేరి మోగిస్తున్నాయి. ఇంకో పక్క నాటో కూటమి ఉక్రెయిన్ కు బాసటగా యుద్ధానికి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలందుతున్నాయి.