Saturday, April 13, 2019

ipl2019 royals beat mumbai by 4 wickets in thrilling clash

చెలరేగిన జోస్ బట్లర్ ఆర్ఆర్ జట్టు గెలుపు
·  ఊపు మీదకు వచ్చిన డీకాక్, రోహిత్
·  అయినా ముంబయికి తప్పని ఓటమి
ముంబయి వాంఖేడ్ స్టేడియం జోస్ బట్లర్ జోష్ కు ఫిదా అయింది. సిక్సర్లు, ఫోర్లు వర్షం కురిపించడంతో ముంబయి ఇచ్చిన లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ఎంతో చిన్నదిగా కనిపించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ మ్యాచ్ నం.27లో ముంబయి ఇండియన్స్(ఎంఐ) ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ముంబయి వాంఖేడ్ స్టేడియంలో శనివారం(ఏప్రిల్13) టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎట్టకేలకు ఓపెనర్ డీకాక్(87) ఊపు మీదకు రావడం, కెప్టెన్ రోహిత్ (47)మళ్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో ముంబయి జట్టు 187/5 సాధించింది.
ఆర్ఆర్ జట్టు 188 పరుగుల లక్ష్య ఛేదనలో 9సిక్సర్లు, 19 బౌండరీలు (130 పరుగులు) సాధించడాన్ని బట్టే ఏ రీతిలో ధాటిగా ఆడిందో అర్థమౌతుంది. ఓ వైపు బౌండరీల మోత మోగించిన కెప్టెన్ అజింక రహానే 21 బంతుల్లో 37 పరుగులు చేసి వెనుదిరగ్గానే మరో ఓపెనర్ జోస్ చెలరేగిపోయి ఆడాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి జోస్ అవుటయ్యాడు. రాహుల్ చహర్ బౌలింగ్ లో సూర్యకుమార్ కు క్యాచ్ ఇచ్చాడు. రహానే క్యాచ్ ను కూడా సూర్యకుమారే అందుకున్నాడు. 60 పరుగుల వద్ద రహానే అవుటవ్వగా 147 పరుగుల వద్ద జోస్ పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లు ముగిసే సరికి 155/2 స్కోరుతో ఆర్ఆర్ జట్టు విజయానికి చేరువలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు వికెట్లను స్వల్ప పరుగుల తేడాతో చేజార్చుకుంది. చివరి ఓవర్లలో గోపాల్ దీటుగా ఆడి జట్టును గెలిపించాడు.

sindhu surrenders before okuhara singapore open


సెమీస్ లో ఓడిన సింధు
సింగపూర్ ఓపెన్ లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి ఒకుహర చేతిలో సింధు ఓటమి పాలయింది. అంతకు ముందే సైనా, శ్రీకాంత్, సమీర్ వంటి టాప్ ఇండియన్ షట్లర్లు టోర్నీ నుంచి వెనుదిరిగారు. శనివారం (ఏప్రిల్13) జరిగిన మ్యాచ్లో ఒకుహర 21-7,21-11 గేమ్ ల తేడాతో ఆరో సీడ్ సింధుపై విజయం సాధించింది. మ్యాచ్ 37 నిమిషాల్లోనే ముగిసింది. 2018 ముగిసే నాటికి సింధు వరల్డ్ టూర్ టోర్నీల్లో 8 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులపై గెలిచింది.

alia bhatt hope to go to hollywood someday


ఏదోక రోజు హాలివుడ్ కు వెళ్తా..ఆలియా భట్
దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొననున్న బాలివుడ్ అందాల బామ ఆలియా భట్ ఏదోక రోజు తను హాలివుడ్ సినిమాల్లో నటిస్తానని తెలిపింది. తెలుగులో తొలిసారిగా కనిపించనున్న ఈ 26ఏళ్ల లిటిల్ స్టార్ త్వరలోనే ఒకరోజు ఆంగ్ల చిత్రంలో నటిస్తానంది. ఆమె బాలివుడ్ లోకి అడుగుపెట్టి ఏడేళ్లే అయింది. అయితే హాలివుడ్ పూర్తిగా కొత్త పరిశ్రమ కావడం వల్ల అక్కడ నటించడం అంత తేలికైన విషయమేమి కాదని చెప్పింది. తనకు ఇంకా చాలా కెరీర్ ముందున్నందున ఎప్పుడో ఒకప్పుడు మాత్రం హాలివుడ్ మూవీ చేస్తానని ఆలియా ధీమా వెలిబుచ్చింది. ఆలియా ప్రస్తుతం బాలివుడ్ లో ‘కళంక్’, సోగ్గాడు రణబీర్ కపూర్ తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’, సంజయ్ లీలా బన్సాలీ చిత్రం ‘ఇన్షాల్లా’లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తోంది.


earthquake measuring 4.9 hits nicobar islands


 అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం (ఏప్రిల్13) ఉదయం 5 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.9 ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో 10 కిలోమీటర్ల కింద భూకంప కేంద్రం ఉన్నట్లు ఎపిసెంటర్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ భూకంపం ప్రభావంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించనట్లు తెలిసింది.

jallianwala bagh massacre centenary indian top leadership pays tributes to all those martyred

జలియన్ వాలా బాగ్ నరమేధానికి నూరేళ్లు
జలియన్ వాలా బాగ్ సామూహిక జన హననం జరిగి వందేళ్లయిన నేపథ్యంలో భారత జాతి నాటి మృతవీరులకు ఘనంగా నివాళులర్పించింది. పంజాబ్ (అమృత్ సర్) లోని జలియన్ వాలా బాగ్ లో ఏప్రిల్ 13, 1919లో బ్రిటిష్ పాలకులు సాగించిన ఈ ఘోర కలి ఇప్పటికీ దేశాన్ని కలచివేస్తున్న దుర్మార్గపు ఘటన. సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని థెరిసా మే జలియన్ వాలా బాగ్ నరమేధం సిగ్గుతో తలదించుకునే పరిణామంగా పేర్కొన్నారు. భారత-బ్రిటన్ చరిత్రలో తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయాల్సిన రోజుని అభివర్ణించారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మృత వీరులకు నివాళులర్పిస్తూ ఈ భయానక నరమేధం పౌర సమాజంపై చెరగని నెత్తుటి మరకన్నారు. మృత వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా మృత వీరులకు ఘన నివాళులర్పించారు. వందేళ్ల నాటి పీడ కల దేశం స్మృతి పథంలో ఇంకా చెరిగిపోలేదన్నారు. ఆ మృత వీరుల శౌర్యం, త్యాగం ఎన్నటికి జాతి మరువదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ , మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూలు శనివారం (ఏప్రిల్ 13, 2019) జలియన్ వాలా బాగ్ స్మారక ప్రాంతం వద్ద మృత వీరులకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఫలాలు పొందుతున్న భారత దేశం ఆనాటి సమరవీరులు త్యాగాల్ని ఎప్పటికీ మరవదని, వారికి తమ వందనాలంటూ రాహుల్ గాంధీ సందర్శకుల పుస్తకంలో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.