Wednesday, March 25, 2020

At Union Cabinet meet with PM Modi, ministers practice social social distancing

కేబినెట్ భేటీలోనూ సామాజిక దూరం
ఇటలీ, ఇరాన్, అమెరికాల్లో ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయింది. అందుకు స్ఫూర్తిగా కేంద్ర కేబినెట్ భేటీలోనూ సామాజిక దూరాన్ని పాటించింది. గడిచిన ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చి విజయవంతం చేసిన ప్రధాని మోదీ తాజా భేటీలోనూ ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించారు. ప్రధాని, మంత్రులు సమావేశంలో రెండేసి మీటర్ల చొప్పున దూరంగా కూర్చుని కరోనా వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంగళవారం దేశ ప్రజల్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన మోదీ 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ప్రస్తుతం భారత్ కరోనా రెండో దశను దాటి మూడులోకి అడుగుపెట్టిన విపత్కర సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటించి, ఐసోలేషన్లో ఉంటేనే వైరస్ నియంత్రణ సాధ్యమన్న నిపుణుల హెచ్చరికల్ని కేబినెట్ సీరియస్ గా అమలులోకి తెచ్చే చర్యలపై చర్చించింది. దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి చెక్ చెప్పడానికి ముమ్మరంగా ప్రయత్నించాలని నిర్ణయించింది. ఏమరపాటు, సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అమెరికా, ఇటలీ, ఇరాన్ లు కరోనా వైరస్ పుట్టిన చైనాను మించి అతలాకుతలం అవుతున్నాయి. పరిస్థితి భారత్ లో దాపురించకుండా ప్రస్తుతం తీవ్రమైన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. తాజా కేబినెట్ భేటీలో నిత్యావసరాల ధరలు నియంత్రణ, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ప్రాసెసింగ్యూనిట్లు లాక్చేయొద్దని సూచించింది. ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల అందుబాటుపై కేంద్రం పర్యవేక్షిస్తుందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఇదే అదనుగా ఉత్పత్తిదారులు, వ్యాపారులు ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.