మహారాష్ట్ర గణేశ్ నిమజ్జనాల్లో 18 మంది మృతి
మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో
18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం అనంత చతుర్దశి
ప్రారంభమైన తర్వాత గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున విగ్రహ
నిమజ్జనాలకు ఆయా ప్రాంతాల్లో భక్తులు తరలివెళ్లారు. థానేలో గురువారం రాత్రి 7.30 సమయంలో కసారాకు చెందిన కల్పేశ్ జాదవ్ అనే 15 ఏళ్ల బాలుడు గణపతి
విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అమరావతిలోని
పూర్ణా నదిలో విగ్రహాల నిమజ్జన సమయంలో వటోల్ శుక్లేశ్వర్ గ్రామానికి చెందిన నలుగురు
మృత్యువాత పడ్డారు. నాసిక్ లోని గోదావరి నది స్నాన ఘాట్ రామ్‌కుండ్ సమీపంలో మునిగిపోయిన
ప్రశాంత్ పాటిల్(38), పహిన్ గ్రామంలోని చెరువులో మునిగిపోయిన యువరాజ్ రాథోడ్(28)
మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. సతారా జిల్లాలోని కరాడ్ వద్ద కోయనా నదిలో మల్కపూర్ నివాసి చైతన్య షిండే(20)
కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అకోలాలో నీటితో నిండిన క్వారీలో నిమజ్జనం చేస్తుండగా విక్కీ మోర్(27) అనే యువకుడు మునిగిపోయినట్లు
పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసినా భక్తులు విగ్రహాలతో అక్కడకు
చేరుకుని నిమజ్జన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. నాసిక్‌లోని సోమేశ్వర్
జలపాతం సమీపంలో లైఫ్‌గార్డులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది
ముగ్గుర్ని రక్షించారు. భండారా జిల్లాలోని డోల్సర్ గ్రామ చెరువులో సోమరా శివానకర్ అనే
వ్యక్తి మునిగిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. అమరావతి, నాసిక్, థానే, సింధుదుర్గ్, రత్నగిరి, ధూలే, భండారా, నాందేడ్, అహ్మద్ నగర్, అకోలా, సతారాతో సహా 11 జిల్లాల్లో జరిగిన నిమజ్జనాల్లో మొత్తం 18 మంది నీట మునిగి ప్రాణాలు
కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో నాలుగు; రత్నగిరిలో మూడు; నాసిక్, సింధుదుర్గ్, సతారాల్లో రెండేసి; థానే, ధూలే, బుల్ధనా, అకోలా, భండారాలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయినట్లు వివరాలు వెల్లడించారు.