Monday, June 24, 2019

bangla tigers win over afghanistan by 62 runs in icc world cup


అఫ్గానిస్థాన్ ను 62 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్
ప్రస్తుత వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మరోసారి తన పట్టును ప్రదర్శిస్తూ అఫ్గనిస్థాన్ పై ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.31 సాథాంప్టన్ రోజ్ బౌల్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన అఫ్గన్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. అఫ్గానిస్థాన్ తొలుత తడబాటు లేకుండానే ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి వికెట్ కు ఓపెనర్లు కెప్టెన్ గుల్బుద్దీన్ నయిబ్(47), రహ్మత్ షా(24) 10.5 ఓవర్లలో 49 పరుగులు స్కోర్ చేశారు. రహ్మత్ షా ను బంగ్లా ఆల్ రౌండర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షాకిబ్ అవుట్ చేశాడు. తర్వాత హష్మతుల్లా షాహిదీ(11)ని మొసాదిక్ హొస్సేన్ బోల్తా కొట్టించాడు. కీపర్ రహీం స్టంప్ చేయగా షాహిదీ వెనుదిరిగాడు. ఆ తర్వాత 28వ ఓవర్ లో షాకిబ్ వరుసగా గుల్బుద్దీన్ , 20 పరుగులు చేసిన అస్ఘర్ అఫ్గాన్ లను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. అఫ్గన్ స్టార్ బ్యాట్స్ మన్ మహ్మద్ నబీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు. చివర్లో కుదురుకుంటున్న నజీబుల్లా జర్దాన్(23)ని కూడా షాకిబ్ బోల్తా కొట్టించాడు. కీపర్ రహీం స్టంపౌట్ చేయగా అతను క్రీజ్ నుంచి నిష్క్రమించాడు. 10 ఓవర్లలో షాకిబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లు ఒక్కొక్కరు వెనుదిరగ్గా సామివుల్లా షిన్వారి(49*) నాటౌట్ గా మిగిలాడు. అఫ్గనిస్థాన్ 47 ఓవర్లకే ఆలౌటై సరిగ్గా 200 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్లు లిటన్ దాస్(16), తమిమ్ ఇక్బాల్(36) పరుగులు చేశారు. షాకిబ్ అల్ హసన్(51) మరో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం(83) జట్టులో అత్యధిక స్కోరు సాధించాడు. చివర్లో మహ్మదుల్లా(27), మొసాదిక్ హొస్సేన్(35) జట్టు పెద్ద స్కోరు చేసేందుకు తోడ్పడ్డారు. అఫ్గన్ బౌలర్లలో ముజ్బుర్ రహ్మన్ 3 వికెట్లు, కెప్టెన్ గుల్బుద్దీన్ నయిబ్ 2 వికెట్లు, దవ్లత్ జద్రాన్, మహ్మద్ నబీలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో అఫ్గనిస్థాన్ ఇప్పటికి ఆడిన 7 మ్యాచ్ ల్లో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్ లపై గెలుపుతో బంగ్లాదేశ్ తన విజయాల సంఖ్యను మూడుకు పెంచుకుంది.



seven killed over 200 injured as train derails in Bangladesh


బంగ్లాదేశ్ రైలు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం 200 మందికి గాయాలు
బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరో 200 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రాజధాని ఢాకా నుంచి సిల్హెట్ కు బయలుదేరి ప్రమాదానికి గురయింది. మౌలోవిబజార్ జిల్లాలోని కులావుర సమీపంలో కల్వర్ట్ వంతెన పాక్షికంగా కూలిపోవడంతో రైలులో ఆరుబోగీలు కింద పడిపోయాయి. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి 11.40 సమయంలో బరాంచల్ వద్ద జరిగింది. చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మహిళలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దర్ని గుర్తించారు. మోన్వార్ పెర్విన్(48), ఫాహ్మిద అక్తర్(20) మృతి చెందారు. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి సుమారు 15 మందిని కాపాడారు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని తెలుస్తోంది. గాయపడిన 62 మందికి కులావుర ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి ఇళ్లకు పంపించేశారు. 24 మందిని సిల్హెట్ ఎంఏజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దాంతో సిల్హెట్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాళిని, జయంతిక ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఈ కల్వర్టు వంతెన మార్గంలో లైన్ మరమ్మతుల పాలవ్వడం లేదా ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో లోపం వల్ల దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నామని రైల్వేశాఖ కార్యదర్శి మొఫాజల్ హోస్సెన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ దుర్ఘటన పై దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.