Thursday, July 25, 2019

Nalini released from vellore prison on parole


వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలైన నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన నళిని గురువారం వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలయింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు నిర్వహించుకునేందుకు ఆమెకు నెలరోజుల పెరోల్ లభించింది. ఈ మేరకు నళిని జులై5న అభ్యర్థించింది. మన్నించిన మద్రాస్ హైకోర్టు 30 రోజుల సాధారణ సెలవు మంజూరు చేసింది. నళినిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు నుంచి ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. వెల్లూర్ సాతువాచారి గ్రామం నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో రంగాపురం తరలించారు. నళిని కూతురు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కలవరాదు..మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే షరతుపై నళినికి పెరోల్ మంజూరయింది. అయితే ఆమె తన కూతురు పెళ్లి ఏర్పాట్లకుగాను ఆరు నెలలపాటు పెరోల్ కోరింది. ప్రభుత్వం కేవలం నెల రోజులు మాత్రమే సాధారణ సెలవులు ఇవ్వగలమని తేల్చి చెప్పింది. 30 రోజుల సమయం పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ఏమాత్రం సరిపోదని నళిని వాదించినా ఫలితం లేకపోయింది. నళిని, మురగన్ (జీవిత ఖైదీ) లు జీవితఖైదు అనుభవిస్తుండగా వెల్లూర్ జైలులోనే కూతురు జన్మించింది. 28 ఏళ్లగా తామిద్దరం జైలులోనే గడుపుతున్నామని తల్లిదండ్రులుగా తమ కూతురు ఆలానాపాలనకు కూడా నోచుకోలేకపోయామని నళిని ఆవేదన వ్యక్తం చేసింది.