Tuesday, May 11, 2021

Italian woman given six doses of Pfizer vaccine by mistake

ఇటలీ మహిళకు ఒకేసారి ఆరుడోసుల వ్యాక్సిన్

ఆమె అదృష్టం బాగుండి బతికి బట్టకట్టింది. కరోనా మహమ్మారి బెడద నుంచి తప్పించుకోవడానికని వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే ఆరుడోసుల్ని ఒకేసారి ఎక్కించేశారు. ఈ ఘటన ఇటలీలో ఆదివారం జరిగింది. ఓ నర్సు ఒత్తిడిలో ఉందో.. ఏమరుపాటు గానో వ్యాక్సిన్ వేసింది. తర్వాత వైల్ ను పరిశీలించగా ఖాళీగా ఉంది. పక్కన 5 ఖాళీ సిరంజీలు దర్శనమిచ్చాయి. అప్పటికి గానీ ఆ నర్సుకు జరిగిన తప్పిదం తెలిసిరాలేదు. అంటే వైల్ లో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ఆరు డోసుల్ని ఒకే సిరంజిలో లోడ్ చేసి మహిళకు ఇంజెక్ట్ చేసింది. పొరపాటు తెలుసుకున్న నర్సు వెంటనే ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళను వెంటనే ఇన్ పెషెంట్ గా చేర్చుకుని వైద్యం అందించారు. ఆమె ఆరోగ్యం 24 గంటల తర్వాత కుదుటపడ్డంతో వైద్య సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు వారాల పాటు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ప్రత్యేక వైద్యుల్ని నియమించారు. ఫైజర్ వ్యాక్సిన్ అధిక మోతాదును పరీక్షించడానికి మునుపటి అధ్యయనాలు నాలుగు మోతాదులకే పరిమితం చేయబడ్డాయి.  అంతకన్నా ఎక్కువ మోతాదులో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయిల్ లో నిషేధం. ఇటువంటి ఘటనే ఈ ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు ఇదేవిధంగా ఓ వృద్ధ మహిళకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల్ని ఒకేసారి ఇచ్చింది. సదరు నర్సు సెల్ ఫోన్ మెసేజ్ లు చూసుకుంటూ ఓ డోసు తీసుకుని అక్కడే కూర్చున్న మహిళకు మరో డోసు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే ఆ మహిళకు ఎటువంటి అనారోగ్యం కల్గకపోవడంతో అక్కడ వైద్యసిబ్బంది హమ్మయ్య అనుకున్నారు.