Monday, December 14, 2020

Thousands of iPhones looted, violence cost us Rs 440 crore in Wistron Bengaluru


 కోలారు ఐఫోన్ ప్లాంట్ విధ్వంసంలో నష్టం రూ.440 కోట్లు

 వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్టు కార్మికులు సాగించిన విధ్వంసంలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు విస్ట్రాన్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన ఐఫోన్ ప్లాంట్ సిబ్బంది తమ జీతాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ శనివారం ఉదయం విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు సమీపంలోని కోలార్ జిల్లాలో గల నర్సాపురలోని ఈ ప్లాంట్‌లో యాపిల్ ఐఫోన్ విడి భాగాలను అమరుస్తుంటారు. ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకున్నారు. ప్లాంట్ లో మరో  1,200 మంది శాశ్వత ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంట్రాక్టు సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో వందలకోట్ల ఆస్తి నష్టం సంభవించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయ్యాయి. నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 5,000 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న 132 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విస్ట్రాన్ ప్లాంట్‌ దాడి ఘటనపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఆందోళనకారులు ప్లాంట్ అద్దాలు పగలగొట్టి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదలకుండా విధ్వంసం సృష్టించినట్లు వివరించారు. భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ తెలిపారు. మూడ్రోజుల్లో సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఇప్పటికే కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.