Tuesday, May 21, 2019

mumbai model gets bail in fake currency case



నకిలీ నోట్ల కేసులో మోడల్ కు బెయిల్
నకిలీ నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేసి అరెస్టయిన 28 ఏళ్ల మోడల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై గత నెల ఏప్రిల్ 19న ఆమెను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మోడల్ సబర్బన్ బాంద్రా లోని బ్యాంక్ లో రూ.2 వేల నోట్లు 75 డిపాజిట్ చేశారు. అందులో 42 నోట్లు నకిలీవిగా కరెన్సీ కౌంటింగ్ మెషిన్ గుర్తించింది. బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మోడల్ ఈ మొత్తాన్ని కేసులో సహ నిందితుడు రాహుల్ బరోద్ వద్ద నుంచి ఏవో అవసరాల నిమిత్తం తీసుకున్నట్లు ఆమె తరఫున లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిలో నకిలీ నోట్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదని అందుకే తన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు వెళ్లారని విన్నవించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీస్ స్టేషన్ అధికారి కూడా ప్రాథమిక దర్యాప్తు లో ఆమెకు నకిలీ కరెన్సీని చలామణి చేసే ఉద్దేశం ఉన్నట్లు తేలలేదని కోర్టుకు తెలిపారు. ఏవ్యక్తి నకిలీ నోట్లను తమ సొంత బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే సాహసం చేయరన్న ప్రాసిక్యూషన్ వాదనకు సమ్మతించిన అడిషనల్ సెషన్స్ జడ్జి ఎ.ఎం.ఖాన్ మోడల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చారు.

PM Modi pays tribute to Rajiv Gandhi on his death anniversary



రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మోదీ సోనియా రాహుల్ ప్రియాంక
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28 వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం (మే21) ఆయనకు  ఘన నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు ఘన నివాళులు అని పేర్కొన్నారు. యమునా నదీ తీరంలో గల వీర్ భూమి లోని రాజీవ్ సమాధిని సందర్శించి సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక ఘన నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో రాజీవ్ కు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ ఆరో ప్రధానిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు పరిపాలించారు. 1991 మే 21న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదుర్ బహిరంగ సభకు వెళ్లిన రాజీవ్ ను.. ఎల్టీటీఈ మానవబాంబు ద్వారా దారుణంగా హత్య చేసింది.