Monday, April 29, 2019

sun rises.. play off hopes alive

సన్ రైజెస్..కింగ్స్ పై పైచెయ్యి
·        వార్నర్ యథావిధిగా హాఫ్ సెంచరీ
·        45 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి
ఉప్పల్ వేదికగా ఐపీఎల్ సీజన్ 12 సోమవారం నాటి మ్యాచ్లో కింగ్స్ లెవన్ పంజాబ్ పై సన్ రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్  ముందు వరకు  హైదరాబాద్, పంజాబ్ జట్లు 5,6 స్థానాల్లో నిలిచాయి. రెండు టీంలు చెరి అయిదు మ్యాచ్ ల్లో గెలిచినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పంజాబ్ కన్నా హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ముందుంది. రెండు జట్లకు సోమవారం 12వ మ్యాచ్ కాగా పంజాబ్ పై  హైదరాబాద్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సమష్టిగా రాణించి విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్  ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వార్నర్ శరవేగంగా మళ్లీ అర్ధ సెంచరీ 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. క్రితం మ్యాచ్ లో ఒక్క బౌండరీ కూడా కొట్టని వార్నర్ ఈ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సహా ఏడు బౌండరీలు బాదాడు. వృద్దీ మాన్ సాహా (28), మనీశ్ పాండే (36)లు మెరవడంతో ఆరు వికెట్ల నష్టానికి 212 భారీ పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, అశ్విన్ చెరి రెండు వికెట్లు, మురగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 213 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ కె.ఎల్.రాహుల్ డెత్ ఓవర్ల వరకు ఆడి 79 పరుగులతో ఒంటరి పోరాటం చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 27 పరుగులు, నికోలస్ పూరన్ చేసిన 21 పరుగులు జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాయి. ఏడు వికెట్లను కోల్పోయి నిర్దేశిత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 167 పరుగులు మాత్రమే చేయగల్గింది. హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరి మూడు వికెట్లు తీయగా సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లోనూ భువనేశ్వర్ కుమార్ కు వికెట్ దక్కలేదు. సన్ రైజర్స్ కలిసికట్టుగా ఆడి 45 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వార్నర్ నిలిచాడు.

sri lanka's face veil ban comes into effect today onwards


శ్రీలంకలో అమల్లోకి వచ్చిన బురఖాల నిషేధం
దేశంలో ఇటీవల జరిగిన వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు సహకరించిన వారిలో బురఖాలు ధరించిన మహిళలున్నట్లు తేలడంతో శ్రీలంక వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం సోమవారం(ఏప్రిల్ 29) నుంచి అమల్లోకి వచ్చింది. శ్రీలంకలో చర్చిలు, అయిదు నక్షత్రాల హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడగా 300 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కళ్లు మినహా మొహాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖాలు ధరించడం వల్ల వ్యక్తుల్ని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అధ్యక్షుడు సిరిసేన కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. యూరప్ లో ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియాల్లో ఆత్మాహుతి బాంబు దాడుల నేపథ్యంలో ఆ దేశాల్లో పూర్తి మొహాన్ని కప్పి ఉంచే బురఖాలపై నిషేధం అమలులో ఉంది.  కెనడా కూడా ఇదే రీతిగా బురఖాలపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించింది. అధ్యక్షుడు సిరిసేన ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ బురఖాల్ని నేరుగా ప్రస్తావించకుండా పూర్తి మొహాల్ని కప్పి ఉంచే బురఖాలపై నిషేధాన్ని పార్లమెంట్ ద్వారా అత్యవసర చట్టంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు బురఖాలు ధరించిన తిరుగుతుండడం వల్ల  నిందితుల్ని పట్టుకోవడంలో నిఘా వర్గాలు, పోలీసులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అనుమానిత ముస్లిం సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ తో పాటు దాని అనుబంధ సంస్థని శ్రీలంక ఇప్పటికే నిషేధించింది. మరో వైపు దేశంలోని సెయిలాన్ జమాయితుల్ ఉలుమాకు చెందిన మత ప్రవక్తలు పూర్తి మొహాల్ని కప్పి ఉంచే బురఖాలు ధరించకుండా ముస్లిం మహిళలు భద్రతా బలగాలకు సహకరించాలని విన్నవించారు. శ్రీలంకలో అల్పసంఖ్యాక వర్గాల్లో హిందువుల తర్వాత 9శాతం జనాభాతో ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో ఏడు శాతం క్రిస్టియన్లు ఉన్నారు.

spice jet plane overshoots runway at shirdi airport operations hit


రన్ వే పై జారిన స్పైస్ జెట్.. ప్రయాణికులు సురక్షితం
షిర్డి విమానాశ్రయంలో సోమవారం (ఏప్రిల్ 29) స్పైస్ జెట్ విమానం రన్ వే నుంచి పక్కకు జారింది. లాండింగ్ ప్రాంతం నుంచి 30-40 మీటర్లు ముందుకు దూసుకువెళ్లి ఆగింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు, ఎవరికీ ఏ హాని జరగలేదు. దాంతో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన షిర్డీకి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఘటన అనంతరం స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రయాణికులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూశామని చెప్పారు. ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నది, ఘటనకు గల కారణంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.