Sunday, May 31, 2020

Protests over police killings rage in dozens of US cities

అల్లర్లతో అట్టుడుకుతున్న అమెరికా

పోలీస్‌ కస్టడీలో నల్లజాతి వ్యక్తి మరణం దరిమిలా అమెరికాలోని పలు నగారాల్లో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. అమెరికాలో న్యూయార్క్, బ్రూక్లిన్, కెంటకీ, టెక్సాస్, అట్లాంటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ తదితర నగరాల్లో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దించారు. సామాజిక దూరం నిబంధనలను గాలికొదిలేసి మాస్క్‌లు ధరించకుండా పలువురు ఆందోళనలకు దిగుతున్నారు. కాలిఫోర్నియాలో బ్యాంకు, పోర్ట్ ల్యాండ్‌లో పోలీసు వాహనాలకు, పలు చోట్ల షాపులు, ఇతర భవనాలకు నిప్పు పెట్టారు. మినియాపోలిస్‌లో శనివారం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుణ్ని దొంగతనం నేరం కింద అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నాడు. దాంతో అతను గిలగిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ పట్ల పోలీస్ అధికారి క్రూర ప్రవర్తన దావానలంలా అమెరికా అంతటా వ్యాపించడంతో ఘర్షణలు పెల్లుబికుతున్నాయి. రాత్రి కర్ఫ్యూను సైతం ఉల్లంఘించి ఆందోళనకారులు హింసాకాండకు పాల్పడ్డారు. లాస్ ఏంజిల్స్‌లో నిరసనకారులు `బ్లాక్ లైవ్స్ మేటర్` అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. 1992లో రోడ్నే కింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు పొట్టనబెట్టుకోవడంతో ఇదే విధంగా అల్లర్లు చెలరేగాయి. దాంతో నాడు సైన్యాన్ని రంగంలోకి దిచారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత అమెరికాలో అల్లర్ల అదుపునకు సైన్యాన్ని రంగంలోకి దించడం ఇదే ప్రథమం.