Friday, October 16, 2020

Punjab: Shaurya Chakra Awardee Balwinder Singh Shot Dead In Tarn Taran

ఉగ్ర తూటాలకు నేలకొరిగిన `శౌర్య చక్ర`

ఉగ్రవాదులకు ఆయన సింహస్వప్నం.. ముష్కరుల ఏరివేతలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన యోధుడు. ఆయనే బల్వీందర్ సింగ్.  నిరుపమాన సేవలకు గాను 1993లో భారత ప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. బల్వీందర్ సింగ్ పై లెక్కలేనన్ని సార్లు ఉగ్రవాదులు హత్యాయత్నాలకు పాల్పడ్డారంటేనే ఆయన వారిపై ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపారో తేటతెల్లమౌతుంది. అయితే ఏడాది కిందట ఎందుకనో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది. దాంతో శుక్రవారం బల్వీందర్ సింగ్ ఇంటిపై దాడి చేసిన దుండగులు ఆయనను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పంజాబ్‌లోని తరణ్ తరణ్ జిల్లాలోని భిఖివింద్ గ్రామంలోని తన నివాసం పక్కనే ఉన్న కార్యాలయంలో బల్వీందర్ సింగ్ ఉండగా మోటార్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. 62 ఏళ్ల ముదిమిలో ఉగ్రవాదులు ఆయనను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదుల‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన బల్వీందర్ సింగ్‌కు పంజాబ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దారుణంగా హత్యకు గురవ్వడం రాష్ట్ర వాసుల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.