Monday, December 13, 2021

Search continues for victims of tornadoes that killed dozens in 7 states of US

టోర్నడోల ధాటికి అమెరికా విలవిల

అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేశాయి. ఇటీవల విరుచుకుపడిన టోర్నడోల ధాటికి ఆ దేశంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలందుతున్నాయి. దాదాపు ఏడు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన టోర్నడోలు జనజీవితాన్ని ఛిద్రం చేశాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల వల్ల ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. సుడిగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భయంకరంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని  గవర్నర్‌ ఆండీ బెషియర్‌ చెప్పారు. మేఫీల్డ్‌ నగరంలో అమెజాన్‌ క్యాండిల్‌ ఫ్యాక్టరీ ధ్వంసమయింది. శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిలో 29 మంది మరణించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. కెంటకీలో మొత్తంగా 70 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 227 మైళ్ల మేర టోర్నడోల ప్రభావం కనిపించిందని గవర్నర్‌ తెలిపారు. స్థానిక అధికారులు, నేషనల్‌ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్‌ మేఫీల్డ్‌ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆర్కాన్సస్‌ రాష్ట్రంలో ఈ  ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. మోనెట్టి మానర్‌ నర్సింగ్‌ హోమ్‌ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. లేక్‌ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్‌ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టోర్నడోల బీభత్సంపై  అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.