Friday, July 3, 2020

Corona cases gone up to 18,750 in Telangana

ప్రగతి భవన్ లోనూ కరోనా కలకలం!
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది. ఈరోజు వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 275కి చేరుకుంది. ఇదిలావుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ ను సైతం మహమ్మారి వణికిస్తోందని సమాచారం. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా సోకి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గం గజ్వేల్ ఫామ్ హౌస్ కు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగురోజులుగా ఆయన అక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడ్డంతోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం అక్కడ నుంచి దూరంగా వచ్చి విధుల్లో పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మరోవైపు రాజధాని హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ పరిధి)లో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో మరోసారి లాక్ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మందు కాదని భావించే ప్రభుత్వం పునరాలోచించినట్లు తెలుస్తోంది.