Saturday, August 8, 2020

Air India Express Plane Touched Down 1km from Beginning of Runway Before Crashing

వందల ప్రాణాలు కాపాడిన బోయింగ్-737 పైలట్లు

కోజికోడ్ బోయింగ్-737 విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగకుండా పైలట్లు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువస్తున్న వందేభారత్ విమానం శుక్రవారం ఘోర ప్రమాదానికి గురికాగా సుమారు 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ విమాన పైలట్లు సమయస్ఫూర్తి వల్లే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం నివారించగలిగారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు విమానంలో మిగిలి ఉన్న ఇంధనం పూర్తిగా వినియోగం అయ్యే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దాంతో విమానం భస్మీపటలం కాకుండా కాపాడగలిగారు. అయితే క్రాష్ ల్యాడింగ్ లో పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలపై వాతావరణం అనుకూలించని పరిస్థితిలో ల్యాడింగ్ రిస్క్ మరింత అధికం. కేరళలోని కోజికోడ్ టేబుల్ టాప్ రన్ వే పై అదే చోటు చేసుకుంది. గత నాల్గు రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వందేభారత్ (ఎయిర్ ఇండియా) విమాన పైలట్లకు రన్ వే స్పష్టంగా కనిపించలేదు. పైగా ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలు ఇతర రన్ వేల కన్నా చాలా చిన్నవి. మనదేశంలో పదేళ్ల క్రితం కర్ణాటక (మంగుళూరు)లో ఇదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఎయిరిండియా బోయింగ్- 737 విమానం కూలిపోయింది. 160 మంది నాటి దుర్ఘటనకు బలయ్యారు. ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన టేబుల్ టాప్ రన్ వే దేశంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి మంగుళూరు, రెండు కోజికోడ్ కాగా మూడోది లేంగ్ వ్యూ(మిజోరం) లో ఉంది. తాజాగా ప్రమాదానికి గురైన 9-1344 విమాన పైలట్లు రన్ వే నం.9 కనిపించక పలుమార్లు ఏటీసీతో సంప్రదించారు. అనంతరం వారి కోరిక మేరకు రన్ వే 10 పై విమానాన్ని దించడానికి ఏటీసీ అనుమతి తీసుకుని ప్రయత్నించారు. 2,700 మీటర్ల మొత్తం రన్ వేలో పైలట్లు సుమారు 1000 మీటర్ల రన్ వే వద్ద ల్యాడింగ్ కు సిద్ధపడ్డారు. ఈ దశలోనే విమానం భారీ కుదుపులకు లోనై రన్ వే నుంచి దూసుకుపోయి 50 అడుగుల లోతుగల లోయలో పడిపోయి రెండుగా విడిపోయింది. దాంతో ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై డీజీసీఏ అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టింది.