Sunday, September 22, 2019

Rohingas are Bangladeshi, says Suu Kyi


రోహింగ్యాలు బర్మా వారు కాదన్న సూకీ: బిట్రన్ మాజీ ప్రధాని
రోహింగ్యా ముస్లింలు బర్మా జాతీయులు కాదు.. వాళ్లు బంగ్లాదేశ్ పౌరులు.. ఈ వ్యాఖ్య చేసిన వారెవరో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రజాస్వామ్య ఉద్యమ కెరటంగా ప్రపంచవ్యాప్త కీర్తి పొందిన మయన్మార్ (బర్మా) పోరాటయోధురాలు ఆంగ్ సాన్ సూకీ మాట. తాజాగా ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బయటపెట్టారు. ఆయన రచించిన `ఫర్ ది రికార్డ్` అనే పుస్తకం ద్వారా ఈ విషయం వెల్లడయింది. గురువారం లండన్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కెమెరూన్ తన పదవీ కాలం (2010-2016)లో చోటు చేసుకున్న అనేక పరిణామాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మయన్మార్ పాలకులు మొదటి నుంచి రోహింగ్యాలపై ఇదే వైఖరి కనబరుస్తుండగా సూకీ సైతం అదే పంథా కల్గి ఉండడమే యావత్ ప్రపంచానికి విస్మయం కల్గించింది. సైనిక పాలన నుంచి మయన్మార్ కు విముక్తి కల్పించాలని నిజమైన ప్రజాస్వామ్యం దేశంలో పరిఢవిల్లాలని పరితపించి స్ఫూర్తిమంతమైన ఉద్యమాన్ని నడిపిన ధీర సూకీ. 1989 నుంచి 2010 వరకు సూకీ సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకు వేదికగా `నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ)` అనే ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ పార్టీకి నాయకత్వం వహించారు. దాంతో సైనిక పాలకులు మొత్తం 15 ఏళ్ల పాటు సూకీని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె కారాగారవాసంలో ఉండగానే 1991లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. ప్రస్తుతం మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ హోదాలో ఉన్న సూకీ కాబోయే అధ్యక్షురాలు. సూకీ అంటే తనకెంతో గౌరవాభిమానాలున్నాయంటూ కెమెరూన్ తన పుస్తకంలో రాశారు. 2013 అక్టోబర్ లో ఆమె లండన్ పర్యటనకు రావడంతో ప్రపంచం మొత్తం కళ్లు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయన్నారు. అప్పటికే మయన్మార్ లో రోహింగ్యాలపై హింస చెలరేగింది. వారిపై అత్యాచారాలు, హత్యలు, జాతి నిర్మూలన దాష్టీకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాఖైన్స్ (ప్రావిన్స్) లో బౌద్ధుల దాడులతో రోహింగ్యాలు లక్షల సంఖ్యలో పొరుగునున్న బంగ్లాదేశ్ కు పారిపోయారు. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి రోహింగ్యాలకు సానుభూతి వెల్లువెత్తుతోందని సూకీ దృష్టికి తెచ్చినట్లు కెమెరూన్ పేర్కొన్నారు. అందుకు సూకీ చెప్పిన సమాధానంతో ఆయన అవాక్కయ్యారు. 'వారు నిజంగా బర్మా వారు కాదు, వాళ్లు బంగ్లాదేశ్ జాతీయులు` అంటూ సూకీ బదులిచ్చారని ఆ పుస్తకంలో కెమెరూన్ రాశారు. పైగా రోహింగ్యాలే కాదు.. బౌద్ధులు హింసకు గురౌతున్నట్లు సూకీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేవలం భయాందోళనల వల్లే అక్కడేదో జరిగిపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ క్రమంలోనే సూకీ మయన్మార్ లో జాతి ప్రక్షాళన జరుగుతోందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సూకీ పాలనాపగ్గాలు చేపట్టాక రోహింగ్యాలపై దాడులు ఆగకపోగా మరింత పెచ్చుమీరినట్లు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిషన్ నివేదిక  స్పష్టం చేసిన అంశాన్ని కెమెరూన్ తన పుస్తకంలో ప్రస్తావించారు. దేశంలో మారణహోమాన్ని నిలువరించడం, దోషులపై దర్యాప్తు జరపడం, నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రూపొందించడంలో సూకీ ప్రభుత్వం విఫలమైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆగస్ట్ 2017లో సుమారు 7,00,000 మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పారిపోయి తలదాచుకున్నారు. తాజాగా విడుదలైన కెమెరూన్ పుస్తకం ద్వారా మరోసారి రోహింగ్యాల కడగండ్లు తెరపైకి వచ్చినట్లయింది.