Monday, March 14, 2022

Chandrababu fires on Y.S.Jagan gov. visits West Godawari district today

కల్తీ సారా బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్తీ మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఏరులై పారుతోందని ఇందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీదే బాధ్యతన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అగ్నిమాపకకేంద్రం నుంచి అసెంబ్లీ హాల్ ప్రధాన ద్వారం వరకు ప్లకార్డులు, మద్యం సీసాలు చేతపట్టుకుని ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే కారణంతో అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేల్ని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, బుచ్చయ్యచౌదరి, పయ్యవుల కేశవ్ లు సస్పెండయిన వారిలో ఉన్నారు.

కల్తీ సారా ఘటనపై సీఎం భేటీ

ఏపీ అసెంబ్లీ లో సీఎం వై.ఎస్.జగన్‌తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చ జరిగింది. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ వారితో పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియపర్చాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ముఖ్యమంత్రి సూచించారు. ఘటనపై సభలో స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.