Wednesday, January 20, 2021

Joe Biden sworn in as America`s 46th President

 అమెరికా అధ్యక్షుడిగా జై బైడెన్ ప్రమాణస్వీకారం

అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది.. ఈ గెలుపు ప్రతి అమెరికా పౌరుడిది అని కొత్త శ్వేతసౌధాధిపతి జోబైడెన్ ఉద్ఘాటించారు. ప్రెసిడెంట్ గా బైడన్, వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ లు జనవరి 20 బుధవారం పదవీ ప్రమాణాలు చేశారు. తొలుత కమలా ప్రమాణస్వీకారం చేయగా తర్వాత బైడెన్ ప్రమాణం చేశారు. అనంతరం జాతినుద్దేశించి అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేశారు. మహోన్నత అమెరికా చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు `అమెరికా డే` గా పేర్కొన్నారు. చరిత్రలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అగ్రరాజ్యంగా నిలిచిందన్నారు.  అమెరికా భవిత కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు మరోసారి అమెరికా ఏకతాటిపై ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వర్ణ, మత వివక్షలకు తమ పాలనలో తావు ఉండబోదన్నారు. ఇటీవల అమెరికా క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి, హింసతో నెలకొన్న భయాందోళనల్ని యావత్ దేశ ప్రజలు సంఘటితంగా నిలిచి పటాపంచలు చేశారన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పూర్వ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జిబుష్ జూనియర్, బరాక్ ఒబామా హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఎన్నికల్లో తనే గెలిచాననే భ్రమలో ఉన్న (తాజా) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వేడుకకు గైర్హాజరయ్యారు.