25 ఏళ్లుగా మహిళ గొంతులో ఇరుక్కున్న విజిల్
·శస్త్రచికిత్స ద్వారా వెలికితీసిన కేరళ వైద్యులు
కేరళలోని కన్నూర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఒక మహిళకు వీడని పీడ నుంచి విముక్తి కలిగించారు. సదరు మహిళ శ్వాసకోశ వ్యవస్థ నుంచి విజిల్‌ను విజయవంతంగా వెలికితీశారు. దాంతో 25 ఏళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమెకు ఉపశమనం లభించింది. కేరళకు చెందిన ఆ మహిళ తన 15వఏట అనుకోకుండా ఈల మింగింది. అప్పుడు కంగారు పడిన బాలిక అధికంగా నీరు తాగింది. అంతటితో ఆ విజిల్ సమస్య తీరిపోయినట్లు భావించి మిన్నకుండిపోయింది. అయితే ఆ ఈల బాలిక గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళంలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు దగ్గు వీడని పీడగా మారింది. అలా రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె 40వ పడిలోకి చేరింది. దగ్గు అంతకంతకు పెరిగిపోతుండడంతో తొలుత ఆస్తమా సోకిందని వైద్యులు అనుకున్నారు. కన్నూర్ జిల్లా మత్తన్నూరులో నివసిస్తున్న ఆమెకు వైద్యం అందిస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఏదో వస్తువు గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. కేసును ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సుదీప్ తెలిపారు.