Friday, June 18, 2021

Curfew relaxation 6A.M- 6P.M in A.P

21 నుంచి ఉ.6 - సా.6 కర్ఫ్యూ బ్రేక్

లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యా దిగివస్తుండడంతో సర్కారు ఈ మేరకు సడలింపులకు మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కరోనా కేసులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,07,764 శాంపిల్స్ ని పరీక్షించగా 6,341 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో కేసుల ఉధృతి అదుపులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా(1,247), చిత్తూరు జిల్లా(919), పశ్చిమగోదావరి జిల్లా(791) పాజిటివ్ కేసులతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయాలని నిశ్చయించింది. ఈ నెల 21 సోమవారం నుంచి ఉదయం 6 - సాయంత్రం6 వరకు లాక్ డౌన్ సడలింపు ప్రకటించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 5కు మూసివేయాలి. జనం 6  గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఆ మేరకు సిబ్బందిని కార్యాలయ విధుల్లో వినియోగించుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కర్ఫ్యూ యథావిధిగా కొనసాగనుంది. సడలింపు  ఉదయం 6 - మధ్యాహ్నం 2 వరకు అమలులో ఉంటుంది.