ఏపీకి భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల చురుగ్గా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి. రాగల నాలుగు రోజులు ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు కురవొచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం 8 గంటల వరకు పార్వతీపురం (విజయనగరం) లో 8 సెం.మీ., వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా)లో అత్యధిక వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. గురువారం (ఆగస్టు 13) న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దాంతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీకి ముందస్తు సూచనలు జారీ అయ్యాయి. మూడు కోస్తా జిల్లాలతో పాటు కర్నూలును భారీ వానలు ముంచెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.