Friday, January 24, 2020

Oxford Dictionary Gets 26 India English Words Like Aadhaar, chawl, dabba, hartal, shaadi

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 26 భారతీయ పదాలకు చోటు
దేశ ప్రజల గుర్తింపు కార్డు ఆధార్ కు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో చోటు దక్కింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజా 10వ ఎడిషన్ శుక్రవారం విడుదలయింది. ఇందులో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా(బడ్డీ), హర్తాళ్ (ఆందోళన), షాదీ (పెళ్లి) వంటి 26 భారతీయ భాషా పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ ఇండియన్ ఇంగ్లిష్ డిక్షనరీలో చాట్‌బాట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్, బస్ స్టాండ్, డీమ్డ్ యూనివర్శిటీ, ఎఫ్ఐఆర్, నాన్-వెజ్, రిడ్రెసల్, టెంపో, ట్యూబ్ లైట్, వెజ్, వీడియోగ్రాఫ్ తదితర 1,000 పదాలకు స్థానం లభించినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్ డివిజన్) ఫాతిమా దాదా తెలిపారు. అలాగే డిక్షనరీ ఆన్‌లైన్ వెర్షన్‌లో విద్యుత్ కోసం (current- for electricity), దోపిడీదారుడు (looter), దోపిడీ (looting), ఉపజిల్లా (one of the areas that a district is divided) వంటి నాలుగు కొత్త భారతీయ ఆంగ్ల పదాలకు చోటు దక్కిందన్నారు. 77 సంవత్సరాల చరిత్ర కల్గిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తొలి నిఘంటువు తొలుత జపాన్‌లో 1942 లో ప్రచురితమయింది. ఓయూపీ ఏర్పడ్డాక ఆల్బర్ట్ సిడ్నీ హార్నబి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ నుంచి 1948లో డిక్షనరీ మొదటి ఎడిషన్ విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని పొందిన ఆయా భాషా పదాల్ని అందిపుచ్చుకుంటూ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఎనిమిది దశబ్దాలుగా సరికొత్త ఎడిషన్లను ఆవిష్కరిస్తూ వస్తోంది. కేంబ్రిడ్జ్ తర్వాత అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీయే. ఈ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన ఓయూపీ ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయ ముద్రణా సంస్థ. 190 దేశాలలో 70 భాషల్లో ఓయూపీ ప్రచురణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా, వృత్తిపరమైన పుస్తకాల్ని ఓయూపీ విడుదల చేస్తోంది.