Monday, August 19, 2019

Dr.Manmohan Sing elected to Rajya Sabha from Rajasthan


మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్న మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల మన్మోహన్ అసోం నుంచి అయిదుసార్లు వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 2019 వరకు ఆయన అసోం తరఫున సభలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం తగినంత మంది శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతోంది. రాజస్థాన్ లో గత ఏడాదే అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గతంలో రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ జూన్ లో అకస్మికంగా మరణించారు. దాంతో రాజస్థాన్ నుంచి ఖాళీ పడిన ఆ స్థానం నుంచి మన్మోహన్ ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈసారి బీజేపీ ఆ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా 233 మంది సభ్యులు ఎన్నికవుతారు, మరో 12 మందిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ ఎగువ సభలో అధికార బీజేపీకి 78 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండగా కాంగ్రెస్ కు 47 మంది సభ్యులున్నారు.