Tuesday, November 1, 2022

Andhra Pradesh formation day celebrations held at CM camp office Tadepalli

ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలుత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 20 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 మందికి అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో గొప్ప సంస్కృతి ఉందనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వై.ఎస్.విజయమ్మ కూడా పాల్గొన్నారు.