అమర జవాన్ కుటుంబానికి టీఎస్ సర్కార్
బాసట
గాల్వాన్ ప్రాంతంలో చైనా సైనికమూకను నిలువరించే ప్రయత్నంలో అసువులు బాసిన
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. సర్కార్ తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం సూర్యపేటలోని వీరజవాన్ కుటుంబం నివసిస్తోన్న ఇంటికి
వెళ్లి వారిని పరామర్శించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల
ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు సంతోష్ బాబు
సతీమణికి గ్రూప్-1 ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. వీరజవాన్ కుటుంబ సభ్యుల్ని
సోమవారం ఆయన స్వయంగా వెళ్లి కలవనున్నారు. చైనా సైనికులతో ఘర్షణలో మరణించిన మిగతా
19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్ర
ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం వెల్లడించారు. సరిహద్దుల్లో
దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి..వీర మరణం
పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి.. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో
భరోసా నింపాలి.. అని కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష
సమావేశం సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే.