వన్యప్రాణి మాంసంపై చైనా నిషేధాస్త్రం
కొవిడ్-19 (కరోనా వైరస్) తీవ్రత దృష్ట్యా దేశంలో వన్యప్రాణి మాంస విక్రయాలు, వినియోగంపై చైనా నిషేధాస్త్రం ప్రయోగించింది. ఈ మేరకు కమ్యూనిస్టు చైనా పాలకులు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడ్డమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక టీవీ చానల్ పేర్కొంది. అధిక మోతాదులో వన్యప్రాణి మాంస భక్షణ సమస్యలకు దారితీస్తోందని చైనా సర్కార్ భావిస్తోంది. మరోవైపు కొవిడ్-19 కారణంగా చైనాలో మృతుల సంఖ్య 2,590 దాటింది. వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య 77 వేల పైమాటేనని తెలుస్తోంది. ఇదిలావుండగా వైరస్ కేంద్ర స్థానం హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వూహాన్‌లో జన సంచారంపై
ఆంక్షల్ని పరిమితంగా సడలించినట్లు సమాచారం. మరోవైపు కొవిడ్-19 బాధితులు 80 వేలకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ప్రకటించింది. ప్రాణాంతక కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ వైరస్ ను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్‌వో ఓ బృందాన్ని పంపగా వారిని హుబెయ్ ప్రావిన్స్, వూహాన్ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వబోమని చైనా స్పష్టం చేసింది. తాజాగా చైనా అనుమతి లభించడంతో మందులు, వైద్య పరికరాలతో కూడిన భారత విమానం బుధవారం ఆ దేశానికి బయల్దేరనుంది.