దేశ వ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బి.ఎఫ్-7 ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మంగళవారం మాక్ డ్రిల్ చేపట్టారు. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మార్గదర్శకత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు సమాయత్తమయింది. గత కొన్ని రోజులుగా చైనా, జపాన్ , హాంకాంగ్, దక్షిణకొరియా తదితర దేశాల్లో బి.ఎఫ్-7 కల్లోలం సృష్టిస్తోంది. దాంతో దేశంలో మోదీ సర్కారు అప్రమత్తమయింది. వ్యాక్సిన్లు, మందులతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు తదితరాల్ని సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు దేశం మొత్తం కరోనా సన్నద్ధతపై మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండకపోవచ్చునంటూనే జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం కోరుతోంది. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కుల్ని తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment