పరిటాల సునీతకు పితృవియోగం
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత తండ్రి
ధర్మవరపు కొండన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనంతపురం జిల్లా వెంకటాపురంలో శనివారం ఉదయం తుదిశ్వాస
విడిచారు. దాంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరిటాల రవి దారుణహత్య దరిమిలా
కొండన్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆయన రాజకీయాలకు కొత్త అయిన కుమార్తె
పరిటాల సునీత వెంట ఉండి నడిపించారు. జిల్లాలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్
గా కొండన్న సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సునీతమ్మ
కుటుంబాన్నిపలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. గడిచిన ఎన్నికల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన
ఆయన మనవడు పరిటాల శ్రీరామ్ ను ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తీవ్ర
సంతాపం ప్రకటించారు. కొండన్నమృతి తీరని లోటని పేర్కొంటూ సునీతమ్మ కుటుంబానికి తన ప్రగాఢ
సానుభూతిని తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సునీతమ్మ కుటుంబానికి కొండంత అండగా
నిలిచిన కొండన్న మరణం బాధాకరమంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా వెంకటాపురంలో ఈ సాయంత్రం
కొండన్న భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.