Saturday, May 4, 2019

mj akbar deposes in criminal defamation case filed against lady journalist


పరువునష్టం కేసులో ఎంజే అక్బర్ ను విచారించిన కోర్టు
మీ టూ ఆరోపణల వెల్లువలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన ఎం.జె.అక్బర్ ను శనివారం(మే4) అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అక్బర్ ఎడిటర్ గా బాధ్యతలు వహిస్తున్న సమయంలో లైంగికంగా తనను వేధించారంటూ రమణి అనే జర్నలిస్ట్ పేర్కొనడంతో ఆమెపై పరువునష్టం దావా వేశారు. రమణి తరఫు న్యాయవాది రెబకా జాన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ అక్బర్ ను పలు అంశాలపై వివరాలు అడిగారు. రమణి తనపై చేసినవి తప్పుడు, అసత్య ఆరోపణలని అక్బర్ పునరుద్ఘాటిస్తూ తన పరువుకు నష్టం వాటిల్లినందున ఈ దావా వేయడం సహేతకమన్నారు. అయితే చాలా ప్రశ్నలకు అక్బర్ నాకు గుర్తు లేదు(ఐడోంట్ రిమెంబర్) అనే సమాధానమిచ్చారు. అక్టోబర్ 17, 2018లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమణి తనపై మీటూ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికలకు ఎక్కడంతో అక్బర్ ఈ కేసు వేశారు. 20 ఏళ్ల క్రితం జర్నలిజంలో అడుగుపెట్టిన కొత్తలో తనను అక్బర్ వేధించారంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేసు తదుపరి విచారణ మే20న జరగనుంది.

Cheers and screams as new Japan emperor greets the people for the first time

ప్రజలకు తొలిసారి దర్శనమిచ్చిన జపాన్ కొత్త చక్రవర్తి


జపాన్ కొత్త చక్రవర్తిని చూడాలని దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో సింహాసనం అధిష్ఠించిన కొత్త చక్రవర్తి నరుహిటో సతీసమేతంగా వారికి దర్శనమిచ్చి అభివాదాలు తెలిపారు. మే4 శనివారం టోక్యలోని రాజప్రాసాదం వరండా నుంచే ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టాక నరుహిటో జన సందర్శనకు వెలుపలికి రావడం ఇదే ప్రథమం. తండ్రి అకిహిటో (85)వృద్ధాప్యం కారణంగానే సింహాసనాన్ని కొడుకు నరుహిటోకు అప్పగించిన సంగతి తెలిసిందే. నాటి చక్రవర్తి హిరోహిటో 1989లో మరణించడంతో ఆ సింహాసనాన్ని అకిహిటో అధిరోహించారు. అందుకు భిన్నంగా 200 ఏళ్ల రాచరిక వ్యవస్థలో తొలిసారిగా చక్రవర్తి జీవించి ఉండగానే వారుసుడు నరుహిటో గద్దెనెక్కారు. పసుపు రంగు దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు ధరించిన సతీమణి మసాకోతో కలిసి పాశ్చాత్య దుస్తులు చిరునవ్వులు చిందిస్తూ నరుహిటో టోక్యోలోని ప్యాలస్ బాల్కనీలోకి వచ్చారు. వేల సంఖ్యలో హాజరైన జనం చక్రవర్తి దంపతుల్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. వాస్తవానికి న్యూఇయర్ వేడుకలు, చక్రవర్తి జన్మదినోత్సవం రోజునే ఈ విధంగా జనం ప్యాలస్ ఆవరణకు చేరుకుంటుంటారు. అయితే కొత్త చక్రవర్తిగా నరుహిటో గద్దెనెక్కడం ఆయనను కుటుంబాన్ని ఓసారి చూడాలని ఈసారి ఇక్కడ ప్రజలు ఉవ్విళ్లూరారు. ఈ సందర్భంగా నరుహిటో మాట్లాడుతూ ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని దేవుణ్ని కోరుతున్నానన్నారు. అదేవిధంగా జపాన్ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తున్నానని, ఇతర దేశాలన్నింటితో చేయిచేయి కలిపి ప్రపంచ శాంతికి పాటుపడతానని చెప్పారు.

tiger found dead in corbett, 3rd big cat death this year


ఉత్తరాఖండ్ అడవుల్లో పెద్దపులి మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ పరిధిలోని కాబొంట్ టైగర్ రిజర్వ్(సీటీఆర్) పారెస్ట్ లో శుక్రవారం సాయంత్రం పెద్దపులి కళేబరాన్ని కనుగొన్నారు. మృతి చెందిన పులికి పదేళ్లుండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు. మృతికి గల కారణాలు స్పష్టం కాలేదు. అయితే పులులు ఒకదానితో మరొకటి పోరాడిన సందర్భాల్లోనే ఎక్కువగా వీటి మరణాలు సంభవిస్తుంటాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఈ అడవుల్లో పులి మృత్యువాత పడిన ఘటనల్లో ఇది మూడోది. పులి మృతి చెందిన పరసరాల్లో నీటి వాగులు వద్ద, నేలపైన నమూనాల్ని సేకరించారు. పులి శరీరంలోని అంతర్భాగాల నమూనాల్ని సేకరించి భద్రపరిచారు. పులి కళేబరానికి పరీక్షలు నిర్వహించాక దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.